దత్తపుత్రుడు జగనే.. ఏపీ సీఎంపై సంచలన ఆరోపణ

ఏపీలో రాజకీయాలలో ప్రధాన పార్టీలు రెండూ కేంద్రంలోని ఒకే పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. వైసీపీ, బీజేపీల ఫ్రెండ్షిప్ ముగిస్తే తాను బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలని టీడీపీ తహతహలాడుతోంది. ఎందుకో కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి అడుగులే పడడం లేదు. అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఏదో ఒక రోజు బీజేపీ కరుణించకపోదా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆ కారణంగానే వైసీపీని, జగన్‌ను కూడా బీజేపీతో లింక్ చేసి విమర్శలు చేయలేకపోతున్నారు చంద్రబాబు.

ఇక జనసేన కూడా టెక్నికల్‌గా బీజేపీతో పొత్తులో ఉన్నందున పవన్ కల్యాణ్ కూడా బీజేపీని ఏమీ అనే పరిస్థితి లేదు. తనను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని జగన్ సహా వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నా దాన్ని పవన్, చంద్రబాబులు ఎన్నడూ బలంగా తిప్పికొట్టలేకపోయారు. బీజేపీకి జగన్ కూడా దత్తపుత్రుడులానే ఉన్నారని అనలేకపోయారు. కానీ… మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడని హర్ష కుమార్ ఆరోపించారు. ఆ కారణం వల్లే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా జగన్‌ బయటపడగలిగారని ఆయన ఆరోపించారు. మోదీకి దత్తపుత్రుడు కావడం వల్లే జగన్ గర్వంతో విర్రవీగుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. జగన్ పొగరు ఆయన నాశనానికేనని హర్ష కుమార్ అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలలో ఇదే అభిప్రాయం ఉందని.. అది పట్టభద్రుల ఎన్నికలలో బయటపడిందని హర్షకుమార్ అన్నారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగనేనని.. ఇంకే కారణం లేదని ఆయన అన్నారు. దళితులను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయలేదని.. కల్తీ మద్యం అమ్మకాలతో డబ్బు సంపాదిస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు.