మేకపాటి ఆస్తి గొడవలు…

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేక సంచలనాలకు వేదికయ్యాయి. జగన్‌కు ప్రజా మద్దతు తగ్గుతోందని తేలిపోగా, టీడీపీ బాగా పుంజుకుందని కూడా నిర్థారణకు వచ్చారు. దానితో అగ్గిమీద గుగ్గిలం అయిన వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి నలుగురిని సస్పెండ్ చేయగా అందులో నెల్లూరు జిల్లా నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.

మేకపాటి ఇప్పుడు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోడంని వైసీపీ అధిష్టానాన్ని సవాసు చేస్తున్నారు. తాను క్రాస్ ఓటింగ్‌కు దిగలేదని ప్రకటిస్తూనే.. అవును ఆ పని చేశానని నర్మగర్భంగా చెబుతున్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని శేఖరన్న చెప్పుకుంటున్నారు.

ఒక మీడియా ఇంటర్వ్యూలో తమ కుటుంబ ఆస్తి తగాదాను ఆయన ప్రస్తావించారు. తన సోదరుడు మోకపాటి రాజమోహన్ రెడ్డి తనకు ఆస్తి పంచివ్వడం లేదని చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. తనకు డబ్బులకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అన్న ఆదుకోలేదని చట్ట ప్రకారం తనకు రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వడం లేదని చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు

సీఎం జగన్ జోక్యం చేసుకుని తమ ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని ఓ సారి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా విన్నవించుకున్నారట. అందుకు జగన్ తల ఊపి ఊరుకున్నారే తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదట. దానితో తనకు రావాల్సిన ఆస్తి ఇంతవరకు రాలేదు. వైసీపీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని చెప్పేందుకు ఆస్తి వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నానని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. మరి రాజమోహన్ రెడ్డి ఇప్పటికైనా కనికరిస్తారో లేదో చూడాలి…