కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ.. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ.. సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయనపై పార్లమెంటు అనర్హత వేటు వేయడం.. తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయ వ్యూహకర్త.. ఒకప్పటి మోడీ శిష్యుడు ప్రశాంత్ కిషోర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం సరికాదని ఆయన అన్నారు.
అయితే.. రాహుల్‌కు జరిగింది అన్యాయని, పార్లమెంటు చేసింది తప్పు అని సామాన్య జనాలకు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా సిద్ధం కాలేదని కిషోర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి గతంలో చెప్పిన మాటలను ప్రధాని మోడీ సహా.. బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలని ఆయన చురకలు అంటించారు. ఓ పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష అనేది చాలా ఎక్కువ అని తెలిపారు.
అటల్ బిహారీ వాజ్‌పాయి గతంలో చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు చేయాలను కుంటున్నానని చెప్పారు. ‘‘సంకుచిత హృదయంగలవారు గొప్పవారు కాలేరు’’ అని వాజ్‌పాయి అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ దోషి అని వెలువడిన తీర్పును, సాంకేతిక అంశాలను చూపించి, అధికార పార్టీ దాక్కొనవచ్చునని, ఆయనపై అనర్హత వేటు అనివార్యమైనదని చెప్పవచ్చునని, అయితే దివంగత వాజ్‌పాయి పుస్తకంలోని ఓ మాటను అధికార పార్టీ పెద్దలు గుర్తు చేసుకోవలసిందని అన్నారు. రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడానికి తొందరపడకుండా ఉండవలసిందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates