ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు: వైసీపీ తేల్చేసింది!!

వైసీపీలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ సినిమాలో పాడిన పాట ‘ఎవ‌రా న‌లుగురు.. ఏరా న‌లుగురు.. ‘ అనే పాట పాడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని భావించిన వైసీపీకి భారీ ఎదురు దెబ్బ‌తగిలింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా.. ఆపార్టీ ఒక స్థానాన్ని కోల్పోయింది. దీనికి న‌లుగురు ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌ని తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఆన‌లుగురు ఎవ‌ర‌నేది ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఆ న‌లుగురి పైనా.. వైసీపీలోనూ క్లారిటీ వ‌చ్చింది. ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నారు. ఒక‌రు నెల్లూరు రూరల్‌ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈయ‌న ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధ‌ గెలుపొందిన వెంటనే శ్రీధర్‌రెడ్డి కుటుంబం నెల్లూరులోని త‌మ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు.

మ‌రొక‌రు నెల్లూరు జిల్లా వెంక‌టగిరి సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఈయ‌న స్థానంలో వైసీపీ ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. ఆనంను అసలు పార్టీలోనే లేనట్లుగా వైసీపీ పరిగణిస్తోంది. తాజా ఎన్నికల్లో ఓటు విషయమై ఆయన్ను వైసీపీ నేతలు ఎవరూ కనీసం సంప్రదించలేదు. దీంతో ఆనం సైతం టీడీపీ కే ఓటే శార‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

తెర‌చాటున ఉన్న ఆ ఇద్ద‌రు వీరే!
ఆ న‌లుగురిలో ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తుండ‌గా.. మ‌రో ఇద్ద‌రు మాత్రం తెర‌చాటున ఉన్నారు. వారిపైనా ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేశారు. ఆయ‌న ఆత్మ‌కూరు నుంచి ప్రాధాన్యం వ‌స్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే అడిగిన కొన్ని పనులు కూడా చేయలేదని, చివరికి ఆయన కుటుంబసభ్యులు ఒకరికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి అడిగినా ఇవ్వలేదని పార్టీ వర్గాల కథనం. దీంతో ఆయ‌న టీడీపీకి అనుకూలంగా ఓటెత్తిన‌ట్టు వైసీపీ నేత‌లు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, మ‌రో నేత‌.. గుంటూరుకు చెందిన ఎస్సీ సామాజిక వ‌ర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హిళా నాయ‌కురాలు. ఈమె కూడా టీడీపీకి అనుకూలంగానే ఓటేశార‌ని.. వైసీపీ గుర్తించింది. ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు కొద్దిరోజుల కిందట తేల్చిచెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వలేనని పునరుద్ఘాటించారు. దీంతో ఆమెకూడా వైసీపీకి వ్య‌తిరేకంగానే ఓటేశారు. మొత్తంగా.. ఆ న‌లుగురు ఎవ‌రో తేలిపోయింది. ఇద్ద‌రిపై ఎలానూ చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేదు. సో.. మిగిలిన ఇద్ద‌రిని ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.