72 ఏళ్ల వయసులో పోరాట పటిమ ఎంత ఉంటుంది? అంటే.. ఆ వయసులో ఏం చేస్తారు చెప్పండి? అంటూ ప్రశ్నిస్తారు ఎవరైనా. కానీ.. ఈ విషయం మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా టీడీపీ అదినేత చంద్రబాబుకు మాత్రం మినహాయింపుగా చెప్పాలి. రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి మొదలైన ఆయన ప్రయాణం అంత ఈజీగా సాగింది కాదు. ఎన్నో ఆటుపోట్లు.. ఎదురుదెబ్బలు ఆయన తిన్నారు. తెలుగు రాజకీయాలు తీవ్రమైన మార్పులు చేసుకుంటున్న సంధి దశలో ఆయన ఉండటం.. ఆయన తోటి వారు దాదాపు రాజకీయాల నుంచి నిష్క్రమించిన వేళలో.. ఆయనకు ఎదురవుతున్న అవమానాలు అన్ని ఇన్ని కావు.
అయినప్పటికీ వాటన్నింటిని భరిస్తూ ముందుకు వెళుతున్న చంద్రబాబుకు 2019 నుంచి ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. విజయం కంటే కూడా ఓటములే ఎక్కువగా పలకరించాయి. అయినప్పటికీ పట్టుదలను వీడకుండా నమ్మిన దాని వెంట నడుస్తూ.. తీవ్రంగా శ్రమిస్తున్న చంద్రబాబు చాలా రోజుల తర్వాత ఆయన ముఖంలో విజయానందంతో వెలిగిపోయింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకానంత గడ్డు పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొంటున్నారు.
మరో మాటలో చెప్పాలంటే..తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్ చేతిలో ఆయన పడిన మాటలు అన్ని ఇన్ని కావు. ఆయన ఎదుర్కొన్న అవమానాలకు మరొకరు అయితే.. మాకొద్దురా ఈ రాజకీయం అంటూ వెనుదిరిగేవారు. ముఖ్యమంత్రిగా దాదాపు పద్నాలుగున్నరేళ్లు చేసిన ఆయన.. ఈ వయసులో ఇన్ని మాటలు అనిపించుకోవాలా? అనుకునేలా జగన్ అండ్ కో వ్యవహరించారని చెప్పాలి. అయినప్పటికీ ఆయన వాటిని పట్టించుకోకుండా పార్టీని విజయతీరాలకు చేర్చటమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటి మూడు పట్టభద్రుల స్థానాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ఈయన ముఖంలో చిరునవ్వు రాలేదు. ముఖంలో ఒకలాంటి గంభీరంగానే ఉన్నారు తప్పించి.. హ్యాపీగా కనిపించలేదు. చేరాల్సిన గమ్యం సదూరాన ఉన్న వేళలో.. చిన్నపాటి విజయానికి పొంగిపోకుండా ఉండటం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే.. తాజాగా వెల్లడైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన తాను అనుకున్నది సాధించారు.
తాను వేసే రాజకీయ ఎత్తుతో ఎంతటి వారైనా సరే కంగుతినాలన్నట్లుగా ఉంటే బాబు వ్యూహరచన ఎంతలా ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా తాజా ఫలితాలు స్పస్టం చేశాయని చెప్పాలి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అనురాధ విజయం సాధించిన తర్వాత ఆయన ముఖం విజయానందంతో వెలిగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన ముఖంలో సంతోషాన్ని చూసినట్లుగా చెబుతున్నారు. బాబు ఉత్సాహాం టీదీపీ నేతల్లోని ఆనందం డబుల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.