ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇగోయిస్ట్ అని ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో చెబుతుంటారు. 151 స్థానాల్లో నాలుగేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన భారీ విజయంలో మేజర్ క్రెడిట్ తనదే అని మొదట్నుంచి ఫీలవుతుున్న జగన్.. ఎమ్మెల్యేలకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు. మంత్రులకే అక్కడ ప్రాధాన్యం లేదంటే.. ఇక ఎమ్మెల్యేలను పట్టించుకునేదెక్కడ? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్లు ఇవ్వడం గగనం అయింది. ముందేమో విజయసాయిరెడ్డి, తర్వాతేమో సజ్జల రామకృష్ణారెడ్డి… వీళ్లు కాకుండా కొందరు సన్నిహిత నేతలు.. వీళ్లను తప్ప ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టించుకున్నది లేదు. వాళ్లను గౌరవించింది లేదు.
మరోవైపు పథకాల మీదే దృష్టిపెడుతూ.. వాలంటీర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారి ద్వారానే అవి జనాలకు చేరేలా చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల జాడే లేదు. కాంట్రాక్టుల్లేవు. మద్యం, ఇసుక సంబంధిత కాంట్రాక్టులన్నీ తనకు సన్నిహితులైన వారికే కట్టబెట్టారు. మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్యేల్లో చాలామంది తాము అంచనా వేసుకున్న సంపాదించుకోలేకపోయామనే అసంతృప్తితో ఉన్నారు. మరోవైపేమో జగన్ తమకు కనీస గౌరవం ఇవ్వకపోవడం.. తమను డమ్మీలను చేయడం పట్ల రగిలిపోతున్నారు.
వైసీపీ హవా ఉన్నంత కాలం వీళ్లందరూ సైలెంటుగా ఉన్నారు. జగన్ భజన కూడా చేశారు. ఎంత అసంతృప్తి ఉన్నా.. నోరెత్తితే జగన్ వైపు నుంచి ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కాబట్టి గప్‌చుప్‌గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. జగన్ బలహీన పడుతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్యేల మైండ్ సెట్ మారిపోతోంది. జగన్ పట్ల అసంతృప్తికి తోడు.. జనాల్లో వ్యతిరేకత చూసి చాలామంది పార్టీ మారే యోచన చేస్తున్నట్లున్నారు.
జగన్ కూడా చాలామందికి టికెట్లు నిరాకరించే ఆలోచన కూడా చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ మొండిచెయ్యి చూపడానికి ముందే తామే ఆ పార్టీకి దూరం కావడానికి చాలామంది నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుంది. వైసీపీలో ఇంతకాలం అస్సలు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయి. వ్యతిరేక స్వరం వినిపించడానికి, పార్టీకి ఎర్ర జెండా చూపించడానికి భయపడట్లేదు. 151 సీట్లతో గెలిచిన వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరిగి.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గెలవడం అన్నది ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో చెప్పకనే చెబుతోంది.
ఐతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైనా.. జగన్‌లో ఏమార్పూ కనిపించలేదు. ఈ ఓటమికి బాధ్యులైన మంత్రులు, ఎమ్మెల్యేలను మందలించారని.. హెచ్చరికలు జారీ చేశారని వార్తలొచ్చాయో తప్ప.. వారితో సంయమనంతో మాట్లాడి దిద్దుబాటు చర్యల గురించి జగన్ ఆలోచించలేదు. ఇది జగన్ ఇగోకు సూచిక. ఫలితమే.. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో చేదు ఫలితం. జగన్‌కు ఉన్న ఇగోకు ఇక ముందు కూడా ఆయన మారుతారని, ఎమ్మెల్యేలను చేరదీస్తారని ఎవ్వరూ అనుకోవడం లేదు. దీని వల్ల రాబోయే రోజుల్లో వైసీపీలో తీవ్ర స్థాయిలో అసమ్మతి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. అది 2024లో ఆ పార్టీ కొంప ముంచడానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.