ఎమ్మెల్సీ ఎన్నికలు పాలక వైసీపీకి పీడకలగా మారేలా ఉన్నాయి. ఇప్పటికే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు మూడూ పోగొట్టుకున్న పాలక వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలోనూ ఏడో సీటును టీడీపీకి అప్పగించేలా కనిపిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటూ తమ ఎమ్మెల్యేలందరినీ విజయవాడలో హోటళ్లలో ఉంచి కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. అయినా కూడా గత అర్ధరాత్రి నలుగురు ఎమ్మెల్యేలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ తరువాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని చెబుతున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌తో పాటు వైసీపీ నుంచే గెలిచిన తాడికొండ శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ కూడా తమతమ హోటల్ రూమ్‌ల నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్లిపోయారని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని చెప్తున్నారు.
ఆ నలుగురితో ఓటేయించే బాధ్యత తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు కంగారుపడుతున్నారట. వీరు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశానికి ఓటేయకపోయినా ఓటింగ్‌కు గైర్హాజరైనా కూడా ఈక్వషన్లు మారిపోతాయని.. ఆ కీలకమైన ఏడో స్థానం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు.
కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున వైసీపీ మంత్రులను కేటాయించి ఆయా ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా వైసీపీ అభ్యర్థులకు ఓటేసేలా చూడాలని పార్టీ ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యేలందరినీ రెండు రోజుల ముందు నుంచే విజయవాడ తీసుకొచ్చి హోటల్లలో ఉంచారు. అయితే.. రాత్రి అకస్మాత్తుగా కొందరు ఎమ్మెల్యేలు మాయమైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో గందరగోళం మొదలైంది.