ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. “జగన్ దొంగ” అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సాధారణంగా వైసీపీపై విరుచుకుపడే టీడీపీ నేతల్లో చింతమనేని ఒకరు. అయితే.. ఎప్పుడూ కూడా ఆయన ఈ రేంజ్‌లో విరుచుకుపడిన, విమర్శలు చేసిన సందర్భాలు లేవు. అయితే.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకున్న నేపథ్యంలో కార్యకర్తల్లో హుషారు నింపేందుకు ఆయన ఇలా వ్యాఖ్యానించారనే చర్చ సాగుతోంది.
ఇంతకీ చింతమనేని ఏమన్నారంటే.. “జగన్ దొంగ. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ముద్దులు పెట్టి.. వారికి దొంగ హామీలు ఇచ్చారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి.. ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఇదే కన్నీళ్లు వైసీపీకి పెట్టించేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు , చంద్రబాబును సీఎంను చేసేందుకురెడీగా ఉన్నారు” అని చింతమనేని వ్యాఖ్యానించారు.
వైసీపీకి మదం పెరిగిపోయిందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి జగన్ పేదలను మోసం చేశారన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయినా నాలుగేళ్లు నుంచి లబ్ధిదారులకు ఇవ్వకుండా సైకోలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి చేస్తే సైకోలా జగన్ నవ్వుతున్నారన్నారు.
‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చింతమనేని వ్యాఖ్యానించారు. దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడమేనని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా, చింతమనేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates