క‌డ‌ప‌, అనంతలో భారీ మార్పులు..

తాజాగా వ‌చ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనంత‌పురం నేత‌లు స‌రిగా ప‌నిచేయలేద‌ని.. వైసీపీ ఒక నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో క‌డ‌ప‌లోనూ జిల్లాల విభ‌జ‌న ఎఫెక్ట్ భారీగా ప‌నిచేసింద‌ని నేత‌లు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల ప్ర‌భావం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా ఉంద‌ని అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అనంతపురం, క‌ర్నూలులో ముగ్గురు కీల‌క నేత‌ల వ్య‌వ‌హారం.. క‌డ‌ప‌లో జిల్లా విభ‌జ‌న వెర‌సి..ఇక్క‌డ గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపిన‌ట్టు ప్ర‌స్తుతం ఒక భావ‌న‌లో పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల‌ విష‌యానికి వ‌స్తే.. ముగ్గురు కీల‌క నేత‌ల వ్య‌వ‌హారం.. జిల్లాలో పార్టీకి సెగ పెడుతున్న విష‌యం కొన్నాళ్లు గా చ‌ర్చ‌కు దారితీస్తోంది. వీరిలో ఇద్ద‌రు మంత్రులు.. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరిని వ‌దిలించుకునేందుకు పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకువాల‌నే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. వారంతా.. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో ఎటూ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నార‌నే వాద‌న ఉంది. వీరిలో ఏ ఒక్క‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నా సామాజిక వ‌ర్గం ప‌రం గా ఇబ్బంది వ‌స్తుంద‌నే ఆలోచ‌న ఉంది.

వాస్త‌వానికి ఉమ్మ‌డి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల‌ను తీసుకుంటే.. మంత్రులు గుమ్మ‌నూరు జ‌య‌రాం, ఉష శ్రీచ‌ర‌ణ్‌లు ఇటీవల కాలంలో తీవ్ర వివాదానికి దారితీశారు. అదేవిధంగా అనంత‌పురంలో మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంక‌ర‌నారాయ‌ణ‌, అనంత‌పురంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికిచెందిన తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వంటివారు నిత్యం వివాదాల్లోనే ఉన్నారు. వీరిపై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వివాదాలు కూడా కొన‌సాగుతున్నాయి. అయినప్ప‌టికీ పార్టీప‌రంగా చ‌ర్యలు శూన్యంగా ఉన్నాయి. ఇది ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించింద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారని స‌మాచారం.

ఇక‌, క‌డప విష‌యానికి వ‌స్తే.. అన్న‌మయ్య జిల్లా ఏర్పాటు… దీనికి కేంద్రంగా రాయ‌చోటిని నిర్ణ‌యించ‌డంపై అప్ప‌ట్లో తీవ్ర వివాదం జ‌రిగింది. ఈ జిల్లాకు రాజంపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని కేంద్రం చేయాల‌నే డిమాండ్ వినిపించింది. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌భుత్వం ఈ వివాదాన్ని తొక్కి పెట్టింది. తాను నిర్ణ‌యించుకున్న మేర‌కే.. రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను కొన‌సాగించింది. కానీ, విద్యావంతులు.. సొంత‌పార్టీ నాయ‌కులు.. ఏకంగా ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు కూడా ఈ విష‌యంలో వేలు పెట్టారు. త‌మ‌కు రాజంపేట కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాల‌ని కోరారు.

అయితే.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ.. ఆయా ప్ర‌భావాలు ప‌డ్డాయ‌ని వైసీపీ అధిష్టానానికి స‌మాచారం అందింది. అన్న‌మ‌య్య జిల్లా నుంచి ప‌డిన గ్రాడ్యుయేట్ల ఓట్ల‌లో మెజారిటీ ఓట్లు వైసీపీకి అనుకూలంగా లేక‌పోవ‌డం.. వెనుక ఇదే కార‌ణ‌మై ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌లో మార్పులు చేప‌ట్టే దిశ‌గా అడుగులు ప‌డ‌తాయ‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.