బీఆర్ఎస్‌కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. నేరుగా కేసీఆర్ కుటుంబమే దిల్లీ లిక్కర్ కుంభకోణంతో ఆపసోపాలు పడుతుంటే పార్టీలో లుకలుకలు, కార్యకర్తల కోపాలతో మరిన్ని సమస్యలు మొదలవుతున్నాయి. రచ్చ గెలుద్దామని కేసీఆర్ బయల్దేరుతుంటే ఇంట్లో తంటాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల రెబల్స్ రెడీ అవుతున్నారు. ఇంకొన్ని చోట్ల అసంతృప్తులు నిత్యం అలజడి రేపుతున్నారు.. మరికొన్ని చోట్ల బీజేపీకి కోవర్టులు తయారువుతున్నారనీ బీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు.. ఇవన్నీ ఎక్కడో ప్రగతి భవన్‌కు దూరంగా జిల్లాలలో జరుగుతుంటే ఇప్పుడు ప్రగతి భవన్ ఉన్న హైదరాబాద్‌లోనే నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తి మొదలైంది. మొదలవడమేంటి.. పార్టీ నేతలను నిలదీసే పరిస్థితి వచ్చింది.
బీఆర్ఎస్‌లో తమకు ఎలాంటి గుర్తింపు లేదని.. లోకల్ నాయకులకు, క్యాడర్‌కు పార్టీ ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వడం లేదని.. తమంటే ఎంఐఎం నేతలు, ఎంఐఎం క్యాడర్‌కు బీఆర్ఎస్ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ ఆలీ వచ్చారు. వారి ముందే హైదరాబాద్ లోకల్ లీడర్లు, కార్యకర్తలు రంకెలేశారు. తమ కోపాన్ని వెల్లగక్కారు. గ్రేటర్‌లో ఎంఐఎం నాయకులకే బీఆర్ఎస్ ప్రాధాన్యమిస్తోంది.. వారు చెబితే సమస్యలు పరిష్కరిస్తున్నారు కానీ తాము చెప్తే అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయడంలేదని.. ఆయన ఫొటోలు ఫ్లెక్సీలలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
అయితే.. వారిని అదుపు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వరం పెంచి ఒకింత ఆగ్రహించినప్పటికీ లోకల్ క్యాడర్ ఏమాత్రం తగ్గలేదు. బీఆర్ఎస్ క్యాడర్‌ను పక్కన పెడితే నష్టపోతారని హెచ్చరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ బీఆర్ఎస్ క్యాడర్‌ను పట్టించుకోకపోతే గ్రేటర్లో పార్టీ దెబ్బతినడం ఖాయమని బహిరంగంగానే అన్నారు. దీంతో తలసాని, మహమూద్ అలీలు బీఆర్ఎస్ కార్యకర్తల తరువాతే ఎవరైనా అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates