ఏపీ మంత్రి విడదల రజిని వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ ఎదుర్కొనక తప్పేలాలేదు. మర్రి రాజశేఖర్‌కు రీసెంటుగా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో వచ్చే ఎన్నికలలో విడదల రజినికి చిలకలూరిపేట సీటు గ్యారంటీ అని తేలిపోయింది. దీంతో ఆమె టికెట్ విషయంలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై ఫ్రీ అయిపోయారు.
టీడీపీ నుంచి పాత ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకే టికెట్ వస్తుందన్న లెక్కలలో ఉంటూ అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తూ వెళ్తున్నారు. అయితే… ఇప్పుడు టీడీపీ అభ్యర్థి మారొచ్చన్న సంకేతాలు వస్తుండడంతో పాటు టీడీపీ అభ్యర్థి నందమూరి కుటుంబానికి చెందినవారు కావొచ్చన్న ప్రచారం జరుగుతుండడంతో విడదల రజినికి కొత్త టెన్షన్ మొదలైందట.
నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున చిలకలూరిపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారని తాజాగా వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే దౌత్యం నెరపడంతో చంద్రబాబు కూడా అంగీకరించారని.. ప్రత్తిపాటికి రాజ్యసభ పదవి కానీ, ఎమ్మెల్సీ కానీ ఇచ్చి సుహాసినిని చిలకలూరిపేట నుంచి పోటీచేయించడానికి అంగీకరించారని వినిపిస్తోంది.
ఇదే నిజమైతే విడదల రజినికి గట్టి పోటీ తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకతకు నందమూరి ఫ్యామిలీ అభ్యర్థి తోడైతే టీడీపీ విజయాన్ని ఆపడం సాధ్యంకాదని స్థానికంగా వినిపిస్తోంది. చిలకలూరిపేటలో కమ్మ ఓట్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. సోమేపల్లి సాంబయ్య, మర్రి రాజశేఖర్, ప్రత్తిపాటి పుల్లారావు వంటి కమ్మ సామాజికవర్గ నేతలే ఇక్కడ దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికలలో మాత్రమే ముదిరాజ్ కులానికి చెందిన విడదల రజిని ఇక్కడ విజయం సాధించారు. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ ప్రతిసారీ కమ్మ నేతలకే టికెట్లు ఇస్తాయి. గత ఎన్నికల్లో ముదిరాజ్ కులానికి చెందిన విడదల రజినికి టికెట్ ఇవ్వగా జగన్ వేవ్‌లో ఆమె విజయం సాధించారు.
ప్రస్తుతం పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చిన చిలకలూరిపేట నియోజకవర్గంలో కమ్మ ఓట్ల తరువాత ముస్లిం ఓట్లు కూడా కీలకమే. ఇక్కడి ముస్లిం ఓటర్లు మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారులుకాగా గత ఎన్నికలో వైసీపీకి ఓట్లేశారు. అయితే.. వైసీపీ కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతుండడంతో విద్యావంతులైన ముస్లింలు చాలామంది వైసీపీకి దూరమైనట్లు స్థానికంగా వినిపిస్తోంది.
ఈ అన్ని సమీకరణల నేపథ్యంలో కమ్మ కులానికి చెందిన నందమూరి సుహాసినికి టీడీపీ ఇక్కడ టికెట్ ఇస్తే విడదల రజినికి కష్టమవుతుంది. అయితే… ఎన్నికలు సమీపించేవరకు సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించరాదని.. అలా ప్రకటిస్తే వైసీపీ వ్యూహం మార్చుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు దగ్గరలో చిలకలూరిపేట అభ్యర్థిగా సుహాసిని పేరు ప్రకటిస్తారని వినిపిస్తోంది.