లోకేశ్ పాదయాత్రలో కొత్త ముఖాలు.. పాత నేతల్లో గుబులు

రాయలసీమలో సాగుతున్న లోకేశ్ పాదయాత్రకు ఆ ప్రాంతంలో మంచి స్పందన కనిపిస్తోంది. అదే సమయంలో పాదయాత్రలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ రంగాలకు చెందినవారు లోకేశ్ పాదయాత్రలో అడుగు కలుపుతున్నారు. పనిలో పనిగా టికెట్లు ఆశిస్తున్న కొత్తవారు కూడా లోకేశ్ దృష్టిలో పడేందుకు, లోకేశ్‌ను కలిసేందుకు పాదయాత్రను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే పాదయాత్రలో లోకేశ్ తో పాటు కలిసి నడుస్తున్నారు.

అయితే, లోకేశ్ పాదయాత్రలో కనిపిస్తున్న కొత్తవారిని చూసి పాత నేతలు, సిటింగ్ ఎమ్మెల్యేలు, గతసారి పోటీ చేసి ఓడిన నేతలు కాస్త కంగారు పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి రావాలని చూసేవారు తాము టికెట్ ఆశించే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని.. అక్కడి సమస్యలను లోకేశ్ ముందు పెట్టి తమకు చాన్సొస్తే ఏం చేస్తామో చెప్తున్నారని.. ఇదంతా తమకు ఎసరు పెట్టే కార్యక్రమమని సిటింగులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కొన్ని నియోకజవర్గాలలో గ్రూపులు, టికెట్ల కోసం వర్గపోరు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తవారు దొరికితే పార్టీని వారిని ఎంచుకునే ప్రమాదముందని పాత నేతలు టెన్షన్ పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో డబ్బు సంపాదించినవారు, హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా ఇతర వ్యాపారాలు చేసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు, అధికారులుగా పనిచేసి రిటైరైన వారు, ఉద్యోగంలో ఉన్నా టికెట్ హామీ దొరికితే వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నవారు లోకేశ్‌ను కలుస్తున్నారు.

పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీలలోనూ కొత్త ముఖాలు కనిపిస్తుండడంతో స్థానిక నేతలు వాటిని తొలగిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ముఖ్యంగా పాదయాత్ర ముగిసిన తరువాత నారా లోకేశ్‌తో భేటీ అవుతున్నవారిలో ఎక్కువగా టికెట్లు ఆశిస్తున్నవారు ఉంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఔత్సాహికుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.