తెలంగాణా ప్రభుత్వానికి సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పదిబిల్లుల పై సంతకాలు చేయకుండా గవర్నర్ తన వద్దే ఫైళ్ళన్నింటినీ ఉంచేసుకున్నారనే ఆరోపణతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రింకోర్టులో ఒక కేసు వేశారు. పదిబిల్లులపై సంతకాలు పెట్టి వెంటనే ఆమోదం తెలిపేట్లుగా గవర్నర్ ను ఆమోదించాలని చీఫ్ సెక్రటరీ తన పిటిషన్లో సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేశారు. అయితే కేసును విచారించిన సుప్రింకోర్టు అలా ఆదేశాలు ఇవ్వటం కుదరదని స్పష్టంగా తేల్చేసింది.
గావర్నర్ కార్యాలయం అన్నది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్ధ కాబట్టి దానికి సుప్రింకోర్టు నోటీసులు, ఆదేశాలు ఇవ్వలేందని స్పష్టంగా చెప్పేసింది. కావాలంటే కేంద్రప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని చెప్పింది. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే బిల్లులు పెండింగ్ లో ఉన్నది గవర్నర్ కార్యాలయంలో అయితే నోటీసులు కేంద్రప్రభుత్వానికి ఇవ్వటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇస్తే గిస్తే రాష్ట్రపతి భవన్ కు ఇవ్వాలి. ఎందుకంటే గవర్నర్లను నియమించేది రాష్ట్రపతే కాబట్టి ఆదేశాలు ఇవ్వగలిగింది కూడా రాష్ట్రపతి మాత్రమే.
అయితే రాజభవన్కే నోటీసులు ఇవ్వలేని సుప్రింకోర్టు రాష్ట్రపతి భవన్ కు ఎలాగిస్తుంది ? కాబట్టి ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు కార్డు పడుతుందో ఎవరికీ అర్ధంకావటంలేదు. అయితే కేసు విచారణలో అసలు బిల్లులు రాజ్ భవన్లో ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని మాత్రం సుప్రింకోర్టు వాకాబు చేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే గవర్నర్-కేసీయార్ మధ్య మొదలైన వివాదంతోనే ప్రోటోకాల్ సమస్యలు పెరిగిపోయాయి.
ఆ ప్రోటోకాల్ సమస్యలే చివరకు ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లెంగా మారి పరిస్ధితి ఇంతవరకు దిగజారిపోయింది. ఒకసారి తన ఇగోను కేసీయార్ పక్కనపెట్టి రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ తో భేటీ అయితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అలాగే గవర్నర్ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే అని కేసీయార్ గుర్తుంచుకోవాలి. లేకపోతే ఈ సమస్యలు భవిష్యత్తులో మరింతగా ముదిరిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. సమస్యంటు ముదిరిపోతే నష్టం కేసీయార్ కే కానీ గవర్నర్ కు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.