ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనపై దాడి చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కాగా.. సభ అదుపు తప్పడంతో 11 మంది టిడిపి సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్సెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేశారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల స్థానాలన్నిటిలోనూ టీడీపీ గెలవడంతో ఆ ఫ్రస్టేషన్‌తోనే వైసీపీ నేతలు ఇలా అసెంబ్లీలో దాడి చేశారన్న విమర్శలు జనం నుంచి వస్తున్నాయి.
సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తరువాత జీవో నంబర్ 1 రద్దు చేయాలని కోరుతూ టీడీపీ సభ్యులు తీర్మానం ప్రవేశం పెట్టారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు..ఈ సందర్భంగా టిడిపి సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.
వారు నిరసన చేస్తుండగా వైసీపీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వారి దగ్గరకు దూసుకొచ్చారు. అక్కడున్న కొండపి ఎమ్మెల్యే డోల బాలాంజనేయ స్వామి, మరో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో ఘర్షణకు దిగారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.. ఇంతలో మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి కూడా అక్కడకు వచ్చి వాదనకు దిగారు. ఈ ఘర్షణలో బుచ్చయ్య చౌదరి కిందపడిపోయారు. సభ అదుపు తప్పడంతో టిడిపి సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ సభను వాయిదా వేశారు.
కాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే తనపై దాడి చేశారంటూ కొండపి ఎమ్మెల్యే బాలాంజనేయ స్వామి ఆరోపించారు. అలాగే వెల్లంపల్లి తనపై దాడి చేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అయితే… టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకరుపై దాడికి ప్రయత్నించడంతోనే వారిని అడ్డుకున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘర్షణ తరువాత టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సీతారాం సస్పెండ్ చేశారు.