వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికార మదాన్ని గ్రాడ్యుయేట్లు దించేశారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మున్ముందు రానున్న ఎన్నికల్లో మార్పునకు సంకేతమని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయని పవన్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్.. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు.
“అధికార మదం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారు. రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏపీ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అన్ని చోట్లా పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతు దారులు ఘన విజయం సాధించారు. ఈ పరిణామాలు రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారాయి. మరోవైపు టీడీపీ మరింత పుంజుకునేందుకు అవకాశం కల్పించాయి. అదేసమయంలో జనసేన కూడా వ్యూహాత్మకంగా టీడీపీకి కలిసి వచ్చింది. వైసీపీని ఓడించాలని జనసేన ఇచ్చిన పిలుపును గ్రాడ్యుయేట్లు తూ. చ. తప్పకుండా పాటించారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates