జ‌గ‌న్‌ను ఇవి కాపాడ‌లేవ‌ని ఇప్పుడు తెలిసిందా…!

రాష్ట్రంలో మొత్తం 9 శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో నాలుగు స్థానిక సంస్థ‌లకు జ‌రిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. స్థానిక సంస్థ‌లు అన్నీ కూడా గుండు గుత్త‌గా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబ‌ట్టి.. ఇక‌, అదే స‌మ‌యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. అయితే.. ఇది కూడా గాలికి కొట్టుకుపోయింది.

దీనికి కార‌ణం.. ఉపాధ్యాయ సంఘాల్లో ఐక్య‌త లేక‌పోవ‌డం.. కొంద‌రు అధికార ప‌క్షానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంద‌ని ఒక వాద‌న తెర‌ మీదికి వ‌చ్చింది. ఇక‌, అత్యంత కీల‌కమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించి జ‌రిగిన 3 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ బోల్తా ప‌డింది. ఇదే ఇప్పుడు వైసీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఇలా ఎందుకు జ‌రిగింది? అని నాయ‌కులు త‌ల ప‌ట్టుకున్నారు.

ఎందుకంటే.. తాము అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని, స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చి గ్రాడ్యుయేట్ల‌కు 4 ల‌క్ష‌ల పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చి.. ఉద్యోగాలు క‌ల్పించామ‌ని.. అలాంట‌ప్పుడు ఇంత వ్య‌తిరేక‌త ఎందుకు వ‌చ్చింద‌ని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు… గ్రాడ్యుయేట్లుగా ఉన్న‌వారి కుటుంబాల్లోనూ అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని..వారు అందుకుంటున్నార‌ని.. అయినా.. ఇంత వ్య‌తిరేక‌త ఎందుకు అనేది వైసీపీ మాట‌.

కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వ‌లంటీర్లు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లు కూడా వైసీపీని ర‌క్షిం చలేక పోయాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఉద్యోగులుకూడా వేత‌నాలు.. ప‌నిభావం వంటి స‌మ‌స్య‌ల‌నుఎదుర్కొంటున్నారు.వీటిని ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే తాజా రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఎలా చూసినా.. ఇప్పుడు వ్య‌వ‌స్థ‌ల‌పై నా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.