టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. సీఎం జగన్ దూకుడుపై ఆయన మండిపడ్డారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు.. అర్ధరాత్రి అరెస్టులు చేయించారు.
ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా ప్రకటించిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ పరిణామాలు స్థానికంగా కాక రేపాయి. ఒకవైపు టీడీపీ సంబరాల్లో ఉన్న సమయంలో మరోవైపు.. ఇలా అరెస్టు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే.. తాజాగా ఈ ఘటనపై రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం బతుకయ్యా నీది జగన్ రెడ్డీ. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుపడతావా? పులి వెందుల టీడీపీ నేత రాంగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడని అరెస్టు చేస్తావా? ఇంతకన్నా నువ్వు ఇంకేం భ్రష్టు పట్టి పోవాల్సి ఉంది. ప్రజాతీర్పును గౌరవించి క్షమాపణలు కోరు!
అని చంద్రబాబు చండ్ర నిప్పులు కురిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.