ఇక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌.. వైసీపీ ఏం చేస్తుంది?

స్థానిక‌సంస్థ‌లు, ఉపాధ్యాయులు, ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కీల‌క‌మైన ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర ప‌రాజయం చ‌వి చూసింది. ఇక‌, శాస‌న మండ‌లిలో టీడీపీ గ‌ళం వినిపించ‌దు.. అని భావించిన వైసీపీ.. ఇప్పుడు మూడు స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. వైసీపీ నేత‌లు భారీ ఎత్తున చ‌తికిల ప‌డిన ద‌రిమిలా.. ఈ నెల 23న నిర్వ‌హించ‌నున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి.

మొత్తం ఏడుగురిని గెలిపించుకుని తీరాల్సిందేన‌ని పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. గట్టి పంతం కూడా పట్టారు. ఇప్ప‌టికే బీసీల‌కు ఎక్కువ స్థానాలు ఇచ్చామ‌ని.. చెప్పుకొంటున్న వైసీపీ వీరిని గెలిపించుకుని తీరాల్సిన ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది. నిజానికి అసెంబ్లీలో సంఖ్యా బ‌లం కూడా ఎక్కువ‌గానే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ఇప్పుడు రెబ‌ల్స్ బెడ‌ద‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం రెండు కూడా ఇబ్బందిగా మారాయి. పైగా గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఘోర ఓట‌మి కూడా వైసీపీని కుంగ‌దీసింది.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో త‌మ స‌త్తా చాటేందుకు వ్యూహ‌ రచ‌న రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పైకి క‌నిపిస్తున్న రెబ‌ల్స్ ఇద్ద‌రే. ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. కానీ, పార్టీలో నివురుగ‌ప్పిన నిప్పులాగా మ‌రింత మంది వ్య‌తిరేకులు ఉన్నార‌ని పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ఒక సీటు కోల్పోవడం ఖాయ‌మ‌నే అంచ‌నాలు కూడా వేసుకుంటున్నారు.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు ఇప్ప‌టికే వైసీపీ అసంతృప్త‌ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఆత్మ‌ప్ర‌బోధాను సారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే ల‌ను ఆయ‌న కోరారు. క‌ర‌డు గ‌ట్టిన వైసీపీ ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెడితే.. అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యే పైనే చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఫోక‌స్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే.. ఎవ‌రు అసంతృప్తిగా ఉన్నార‌నేది మాత్రం గోప్యంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో గ్రాడ్యుయేట్ ఫ‌లితాలు రిపీట్ అవ‌కుండా.. చూడాల‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.