ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఇప్పటికే టీడీపీ ఖాతాలో పడగా.. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీకే దక్కింది. పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడినా.. చివరకు టీడీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి దక్కకపోవడంతో రెండు ప్రధాన్యత ఓట్లను లెక్కించారు.
రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి ఆధిక్యత కొనసాగింది. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 700 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకు న్నారు. తొలి ప్రధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యాన్ని కనబర్చిన వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత లెక్కింపులో క్రమంగా తగ్గతూ వచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి బయటకు వెళ్లిపోయారు. దీంతో గెలుపుపై అధికారులు ప్రకటన చేశారు.
మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. పోటీలో నిలిచిన 33మంది స్వతంత్రులు, బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి. దీంతో ఆయన సునాయాసంగా విజయం దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా… రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి లక్షా 12 వేల 688 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85 వేల423 ఓట్లు వచ్చాయి. ఇక, ఆది నుంచి నువ్వా -నేనా అన్నట్టుగా సాగిన పశ్చిమ రాయల సీమలోనూ.. ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థి రాం గోపాల్ రెడ్డి విజయం దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ జెండా మూడు ప్రాంతాల్లోనూ రెపరెపలాడడం గమనార్హం.