ఎన్నికల ఏదైనా విజయమే తప్పించి అపజయం అన్నది తమ హిస్టరీలో లేదన్నట్లుగా మాట్లాడే వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ కారణంగా ఇప్పుడు వారు తమ ఓటమిని కవర్ చేసేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉండగా.. మూడో పట్టభద్రుల స్థానమైన పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ స్వల్ప అధిక్యతలో ఉండి.. గెలుపు దిశగా అడుగులు వేస్తుందన్న సంకేతాలు వెలువుతున్న వేళ.. సీన్లోకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి రియాక్టు అయ్యారు.
తాము విజయం సాధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆయన.. ఉపాధ్యాయ వర్గాలు వైసీపీని బాగా ఆదరించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సజ్జల.. ‘ఏమీ మారలేదు’ అని వ్యాఖ్యానించారు. ఓట్ల బండిల్స్ లో ఏదో గందరగోళం చోటు చేసుకుందున్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన.. కౌంటింగ్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణ చేశారు. అవకతవకల మీద ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతోనే ఏదో అయిపోయిద్దని అనుకోవద్దన్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని అతి చిన్న వర్గమని.. వారికి తాము ఎలాంటి సంక్షేమ పథకాల్ని అందించటం లేదని చెప్పుకోవటం గమనార్హం. ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీకి చెందినవి కావన్న సజ్జల.. ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రతిబింబించవని చెప్పారు. ఈ ఫలితాల్ని తాము హెచ్చరికలుగా భావించటం లేదన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ సాధించిన విజయాన్ని తక్కువ చేసినట్లుగా తేల్చేసిన ఆయన.. పట్టభద్రుల స్థానాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కంటే తక్కువగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించటాన్ని గొప్పగా చెప్పుకోవటం గమనార్హం. ఏమైనా.. ప్రత్యర్థుల గెలుపును తక్కువ చేయటం.. తమ విజయాన్ని గొప్పగా చెప్పుకున్న సజ్జల మాటల్ని వింటుంటే.. వావ్.. వాటే కవరింగ్ అన్న మాటలు పలువురి నోటి నుంచి విన్నట్లుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates