ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడప మాత్రం కంచు కోట. ఇక్కడ వైసీపీకి ఎదురులేదనే పరిస్థితి ఉంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఎంపీ స్తానాలు(కడప, రాజంపేట) సహా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాతో ముడిపడిన రాయలసీమ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఘోర పరాజయం పాలైంది.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ(కడప-అనంతపురం-కర్నూలు) టీడీపీ విజయం దక్కించుకుంది. ముఖ్యంగా కడప పరిధిలో నూ వైసీపీ అభ్యర్థులకు ఆశించిన ఓట్లు పడలేదు. ఈ రెండు చోట్ల కూడా వారికి ఎదురుగాలి వీచింది. దీంతో కడపలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అనే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్‌ను తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పట్టభద్రుల ఓటింగ్ పరిశీలిస్తే ఓటర్ మూడేంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలు నమ్ముకున్నామని, కేవలం బటన్ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నామని వాపోతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోందని… డేంజర్ బెల్స్ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రధానంగా సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇలా జరగడం పట్ల నాయకులు ఏమీ మాట్లాడలేని పరిస్తితి రావడం గమనార్హం. మరి దీనిని వచ్చే ఎన్నికల నాటికి సరిచేసుకుంటారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates