నిమ్మ‌ల స్పెష‌ల్‌.. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌నే హైలెట్‌..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల రామా నాయుడు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న హెలెట్‌గా నిలిచారు. వాస్త‌వానికి బ‌డ్జె ట్ ప్ర‌సంగం రోజుకు ముందు రోజు.. ఆయ‌న‌ను, ప‌య్యావుల‌కేశ‌వ్‌ను కూడా స‌భ జ‌రిగిన‌న్నాళ్లు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. నిజానికి ఇలా స‌స్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. తీరిగ్గావారి ప‌నులు చేసుకుంటారు.

త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లినా వెళ్ల‌కపోయినా.. ఇక‌, త‌మ‌కు స‌భ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా స‌స్పెండ్ అయిన వారు వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ, నిమ్మ‌ల మాత్రం అలా వ్య‌వ‌హ‌రించ‌లేదు. స‌భ‌లో జ‌రుగుతున్న కార్య క్ర‌మాల‌ను ఆయ‌న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చూశారు. వాటికి అనుగుణంగా ఆయ‌న త‌న వ్యూహాలు ఏర్పాటు చేసుకుని ఒంట‌రిగానే ప్ర‌భుత్వంపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు.

వ‌రుస‌గా ఏదో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిమ్మ‌ల‌.. తాజాగా చేసిన నిర‌స‌న మొత్తంగా బిగ్ హిట్ కొట్టింది. తూర్పు కాపుల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. నిజానికి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటివారు ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. వీరి స‌మ‌స్య‌ల‌నే నిమ్మ‌ల ప్ర‌స్తావించారు. తూర్పు కాపుల‌ను ఇత‌ర జిల్లాల్లో బీసీలుగా ప‌రిగ‌ణిస్తున్న ప్ర‌భుత్వం ఒక్క ఉత్త‌రాంధ్ర‌లో మాత్రం ఎందుకు వారిని ఓసీలుగా చూస్తోంద‌ని నిల‌దీశారు.

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చే అవ‌కాశం కూడా లేక‌పోవ‌డంతో అసెంబ్లీకి వ‌చ్చిదారిలో చివ‌ర‌న ప్ల‌కార్డు ప‌ట్టుకుని.. ఇదే విష‌యాన్ని మీడియాతోనూ మాట్లాడారు. సుమారుగా.. స‌భ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నంత సేపూ.. నిమ్మ‌ల ప్ల‌కార్డును ప‌ట్టుక‌ని నిల‌బ‌డి.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఒక‌వైపు చినుకులు ప‌డుతున్నా కూడా.. త‌ను త‌డుస్తున్నా.. కూడా ఆయ‌న ప‌ట్టించుకోకుండా.. ఈ నిర‌స‌న‌ను కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ద‌టీజ్ నిమ్మ‌ల‌!! అని టీడీపీ నేత‌లు ప్ర‌శంసించారు.