బన్నీ రవితేజ తర్వాత చిరంజీవితో

అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తో సోలో హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన సుశాంత్ కి టైం ఏమంత కలిసి రాలేదు. డెబ్యూతో మొదలుపెట్టి మధ్యలో ఒకటి రెండు తప్ప దాదాపు అన్నీ డిజాస్టర్లు కావడం కెరీర్ మీద ప్రభావం చూపించింది. ఆ మధ్య చిలసౌ బాగానే ఆడినప్పటికీ ఎందుకనో దాన్ని నిలబెట్టుకోవడంలో తడబడ్డాడు. ఇచట వాహనములు నిలుపరాదు తిరిగి తనని మొదటి పరిస్థితికే తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ కావడం ద్వారా సుశాంత్ ఒకరకంగా తెలివైన అడుగులు వేస్తున్నాడు. అల వైకుంఠపురములో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం బాగానే కలిసి వచ్చింది.

దాంట్లో పాత్ర మరీ బెస్ట్ కాదు కానీ త్రివిక్రమ్ డైరక్షన్ లో చేసిన సంతృప్తిని మిగిల్చింది. తర్వాత రావణాసురలో రవితేజతో భాగమయ్యే ఛాన్స్ దక్కింది. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ రివెంజ్ డ్రామాలో తనకు బాగానే స్కోప్ దక్కినట్టు ఇన్ సైడ్ టాక్. సినిమా కనక హిట్ అయితే మరిన్ని మంచి పాత్రలు వస్తాయని యూనిట్ సభ్యుల మాట. ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ కొట్టేశాడు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ లో కీర్తి సురేష్ కి జోడిగా ఒక ప్రత్యేక పాత్రకు ఒప్పుకున్నట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇందులో సుశాంత్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ఒరిజినల్ తమిళ వెర్షన్ వేదాళంకు కొన్ని కీలక మార్పులు చేసిన భోళా శంకర్ షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోంది. కీర్తి సురేష్ కు సంబంధించిన షెడ్యూల్ ని వేగంగా షూట్ చేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ దృష్యా చిరు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దాని ఫలితం చూశాకే కొన్ని ముఖ్యమైన రిపేర్లు చేయించారని టాక్ ఉంది. మొత్తానికి సుశాంత్ కేవలం హీరో పాత్రలని గిరి గీసుకోకుండా ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకోవడం యాక్టింగ్ పరంగా మంచి పరిణామమే