వైసీపీలో విజయసాయిరెడ్డి హవా తగ్గి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలూ అలాగే కనిపించాయి. విశాఖపట్నం ప్రాంత బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించడం.. సోషల్ మీడియా బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించి సజ్జల కొడుక్కు అప్పగించడం వంటివన్నీ దీనికి ఉదాహరణలుగా చెప్తారు. అంతకుముందులా సాయిరెడ్డి కూడా నిత్యం జగన్ వెంట కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని.. సజ్జలదే వన్ మ్యాన్ షో నడుస్తుందని పార్టీ వర్గాల నుంచి కూడా వినిపించింది.
అయితే.. సజ్జల ఎంతగా పవర్ సెంటర్లా మారినా కూడా ఆయన రాష్ట్రం వరకు.. పార్టీ వరకు మాత్రమేనని.. పార్టీకి వెలుపల రాజకీయం నడపాలన్నా, రాష్ట్రం బయట వ్యవహారం చేయాలన్నా ఆయన వల్ల సాధ్యం కాదని జగన్‌కు కూడా తెలుసంటారు. అందుకే… కీలకమైన పనులలో ఇప్పటికీ సాయిరెడ్డిపైనే జగన్ ఆధారపడుతున్నారట.
తాజాగా దిల్లీ పర్యటనకు వచ్చిన జగన్ పూర్తిగా విజయసాయిరెడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పేరుకు పెద్దసంఖ్యలో ఎంపీలున్నప్పటికీ వారిలో ఎవరూ కూడా సాయిరెడ్డిలా కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద యాక్సెస్ ఉన్నవారు లేరు. అంతెందుకు మీడియా సంబంధాలు కూడా వారికి అంతంతమాత్రమే. వైసీపీ ఎంపీల్లో 90 శాతం మందికి పార్లమెంటులో తమ పక్క సీటులో కూర్చున్నవారు తప్ప వేరేవారితో పరిచయమే లేదు. కేంద్ర మంత్రులను కలిసిన అనుభవమే లేదు. కారణమేదైనా జగన్ హఠాత్తుగా దిల్లీ వచ్చి ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు వేర్వేరు నేతలను కలిసే పని పెట్టుకోగా సాయిరెడ్డి ఆఘమేఘాలమీద అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు.
జగన్ దిల్లీ నుంచి వెళ్లిపోయాక కూడా జగన్ ఎవరెవరితో భేటీ అయ్యారో.. ఏమేం పనులకోసం వచ్చారో అదంతా ఫాలో అప్ చేసుకునే బాధ్యతా సాయిరెడ్డిదే. అంతెందుకు ఏపీకి డబ్బుల కోసం రాష్ట్ర అర్ధిక మంత్రి బుగ్గన దిల్లీకి వచ్చినా కూడా సాయిరెడ్డి సపోర్టు లేకుండా ఆయన ఏమీ సాధించలేని పరిస్థితి. అందుకే సాయిరెడ్డి ఇప్పటికీ వైసీపీకి మోస్ట్ డిపెండబుల్ అంటున్నారు ఆయన వర్గం నేతలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates