కన్నా.. ముగ్గురిని టెన్షన్ పెడుతున్నావు కదన్నా…!

కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి. ఆరు సార్లు ఎమ్మెల్యే. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తిరుగులేని నాయకుడు. ఇటీవలే బీజేపీపై అలిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన సంతోషంగానే ఉన్నారు. ఎక్కడైనా పోటీకి రెడీ అంటున్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. టీడీపీలో కొందరు ఆశావహులకు ఇప్పుడదే పెద్ద సమస్యగా మారింది.

కన్నా లక్ష్మీనారాయణకు పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలతోపాటు జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అనుచరవర్గం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కన్నా ఎక్కడ నుంచి పోటీకు దిగుతారనేది ఇప్పడు చర్చంశనీయంగా మారింది. గుంటూరు వెస్ట్‌, పెదకూరపాడు , సత్తెనపల్లి నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయవచ్చు అని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్. ఈ మూడూ సీట్లలో ఏది కన్నా లక్ష్మీనారాయణ ఆశించినా ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకడుగు వేయరనే ప్రచారం జరుగుతోంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర పని చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో …. మేయర్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. కార్పొరేటర్లుగా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన చాలా ఖర్చు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు తనదే అన్న ఆశతో పనిచేస్తున్న కోవెలమూడి రవీంద్రకు కన్నా లక్ష్మీనారాయణ చేరిక….ఇబ్బందిగా మారింది. కన్నాకు టికెట్ ఇచ్చి తనను మొహమాటపెట్టేస్తారన్న భయం రవీంద్రలో కనిపిస్తోంది.

ఇక కన్నా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడుపైనే ఆయన అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కన్నా అక్కడ నుంచి వైదొలిగిన తర్వాత టీడీపీ తరపున కొమ్మాలపాటి శ్రీధర్ ఒకసారి గెలిచారు. ఇప్పుడు ఆయన టీడీపీ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తూ కార్యకర్తలను, జనాన్ని కలుపుకుపోతున్నారు. పెదకూరపాడుపై కన్నా ఒక కన్నేశారంటే తన పని గోవిందా అని శ్రీధర్ టెన్షన్ పడుతున్నారట.

ఆ రెండు నియోజకవర్గాలు కాదూ.. సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని కన్నా భావిస్తున్నారట. పెదకూరపాడు, సత్తెనపల్లి పక్కపక్కనే ఉంటే నియోజకవర్గాలు. సత్తెనపల్లిలో కన్నాకు చాలా మంది మిత్రులు, సన్నిహితులున్నారు. సామాజికంగానూ సత్తెనపల్లి ఆయనకు కలిసొచ్చే ప్రాంతం. ప్రస్తుతం సత్తెనపల్లికి టీడీపీ ఇంఛార్జ్ కూడా లేకపోవడం కన్నాకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం సత్తెనపల్లి టికెట్ ఆశిస్తూ జనంలో ప్రచారం కూడా మొదలెట్టారు. అధిష్టానానికి శివరాంపై ఆసక్తి లేదని, అందుకే సత్తెనపల్లి టికెట్ కన్నాకే ఖాయమని స్థానికంగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

మూడు నియోజకవర్గాలు కన్నాను ఆహ్వానిస్తున్న వేళ.. మరి కన్నా దేనికి ఆసక్తి చూపుతారు. అధిష్టానం కన్నాను ఎక్కడ నుంచి పోటీ చేయిస్తుందో తెలిసేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే చంద్రబాబుకు పెద్ద నాన్చుడు బేరంగా పేరుంది. అప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులకు టెన్షన్ తప్పదు.