ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పలకరించగా ఆయన కూడా వారితో సరదాగా మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను చూసి వచ్చి పలకరించారు. ఏం హీరోగారూ అంటూ బాలకృష్ణను మంత్రి బొత్స అభివాదం చేశారు.
మరోవైపు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా బాలయ్య వద్దకు వచ్చి పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గుడివాడ అమర్నాథ్‌తో సరదాగా సెటైర్లు వేశారు. ‘ఈరోజు కోటు వేసుకుని రాలేదా?’ అంటూ అమర్నాథ్‌తో అనగా ఆయన కూడా స్పోర్టివ్‌గా తీసుకుని సరదాగా నవ్వేశారు.
అంబటి రాంబాబు, బాలయ్య సరదాగా నవ్వుకుంటూ కాసేపు మాట్లాడడం కనిపించింది. అంబటి రాంబాబే స్వయంగా బాలయ్య వద్దకు రాగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు బాలయ్య వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించి వెళ్లారు.
అదే సమయంలో తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితి పైన ఆయన ఆరా తీశారు. అసెంబ్లీకి వెళ్లే రహదారిని పరిశీలించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
మరోవైపు బడ్జెట్ సమావేశాలలో ఈ రోజ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, కుతూహలమ్మ, పాకలపాటి సర్రాజు, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.