వ‌రుస వివాదాల‌తో ఇబ్బందుల్లో టీడీపీ!

టీడీపీని వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో చేయాల‌నే తొంద‌రో.. లేక అధికార ప‌క్షాన్ని మ‌రింత డిఫెన్స్ లోకి నెట్టాల‌నే ఆతృతో తెలియ‌దు కానీ.. టీడీపీ చేస్తున్న ప‌నుల‌తో ఆ పార్టీనే ఇబ్బందుల్లో ప‌డుతోందని అంటున్నారు పార్టీ అభిమానులు. కొన్నాళ్ల కింద‌ట‌.. గ‌న్న‌వ‌రంలో టీడీపీ కార్యాల‌యం ధ్వంసం జ‌రిగింది. ఈ క్ర‌మంలో పార్టీ కీల‌క నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు కొట్టార‌నేది టీడీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇక‌, ప‌ట్టాభి కూడా త‌న త‌ల‌కు ముసుగువేసి.. కొంద‌రు కుమ్మేశార‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు.. ఆతృత‌గా కొన్ని ఫొటోల‌ను మీడియాకు రిలీజ్ చేశారు. ఇంకేముంది.. టీడీపీ నుంచి వ‌చ్చిన‌వేన‌ని భావించిన కొన్ని ప‌త్రిక‌లు.. మీడియాల్లో కూడా ఆ ఫొటోలు ప్ర‌చురించారు. ప్ర‌సారం చేశారు. ఈ ఫొటోల్లో ప‌ట్టాభి మోకాళ్లు వాచిపోయి.. గాయాల‌తో ఉన్నాయి.

దీంతో పెద్ద ఎత్తున ఏపీ పోలీసుల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇంత‌గా కొడ‌తారా? అంటూ నెటిజ‌న్లు ఫైరయ్యారు. అయితే.. ఆ ఫొటోలు పాత‌వి కావ‌డం..పైగా ఏడాది కింద‌టివి కావ‌డంతో త‌ర్వాత‌.. తీరిగ్గా టీడీపీ నాయ‌కులు త‌ప్పు జ‌రిగిందంటూ.. చిన్న వివ‌ర‌ణ ఇచ్చారు. ఫ‌లితంగా అధికార ప‌క్షానికి టీడీపీ అడ్డంగా దొరికి పోయింది. ఇక‌, తాజాగా అసెంబ్లీ విష‌యాన్ని తీసుకున్నా.. టీడీపీ నేత‌లు ఆరాప‌డ్డార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

అసెంబ్లీలో ప్రొటోకాల్ విష‌యం ర‌చ్చ జ‌రిగింది. స‌మావేశాల ప్రారంభం రోజు.. ముందుగా గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చార‌ని.. త‌ర్వాత తీరిక‌గా సీఎం జ‌గ‌న్ వ‌చ్చార‌ని.. దీంతో గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌.. స్పీక‌ర్ త‌మ్మినేని చాంబ‌ర్‌లో సీఎం కోసం వేచి ఉన్నార‌ని టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్ ఆరోపించారు. ఇదే విష‌యం ప్ర‌చారంలోకి వ‌చ్చేసింది. ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో బ్యాన‌ర్ ఐటంగాను వ‌చ్చేసింది. అయితే.. ఇది అవాస్త‌వ‌మ‌ని.. ప్ర‌భుత్వ ప‌క్షం పేర్కొంది.

గ‌వ‌ర్న‌ర్ కంటే ముందుగానే సీఎం జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌చ్చి.. ఆయ‌న రాక‌కోసం వేచి చూశార‌ని.. ప్ర‌భుత్వ ప‌క్షం ఆడియో క్లిప్స్‌తో స‌హా నిరూపించింది. దీంతో టీడీపీ చేసిన వాద‌న తీవ్ర దుమారం రేప‌డంతోపాటు.. పార్టీపైనా మ‌ర‌క‌లు ప‌డేలా చేసింది. అంతేకాదు.. కీల‌క‌మైన అసెంబ్లీ వ్య‌వ‌హారాల విష‌యంలో ఇంత తేలికగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే కామెంట్లు వ‌చ్చేలా కూడా ప‌రిస్థితి మారింది. మొత్తానికి ఈ రెండు విష‌యాలు కూడా టీడీపీని కార్న‌ర్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇక‌ముందైనా త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటారో లేదో చూడాలి.