సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో “జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా” హ్యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో 8వ ప్లేస్‌లో ఉంది. సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా డాక్టర్ సునీతకు న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా ట్యాగ్‌తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు.
మరోవైపు మరోవైపు టీడీపీ నేతలు కూడా ట్వీట్ల రూపంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే(మాజీ వైసీపీ నాయకుడు) గొట్టిపాటి రవి విభిన్నంగా స్పందించారు. సినిమా రిలీజ్ అవ్వకముందే కథ మొత్తం చెప్పగలిగేవాడు డైరెక్టర్ మాత్రమే కదా అంటూ వివేకా హత్యపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆసక్తికర ట్వీట్ చేశారు.
4 ఏళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి చెప్పినంత క్లుప్తంగా చెప్పలేకపోయిందన్నారు. కానీ హత్య జరిగిన నాడే అంత వివరంగా జగన్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను గొట్టిపాటి రవి తన ట్వీట్కి జత చేశారు.
వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన హంతకులే నాలుగు సంవత్సరాలుగా నాలుగు కట్టుకథలు వినిపించారని నారా లోకేష్ అన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐని బెదిరిస్తూ, దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్న అసలు నిందితులైన అబ్బాయిలని అరెస్టు చేసి.. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన పాదయాత్రలో డిమాండ్ చేశారు.