సిగ్నల్ ఇచ్చిన జగన్.. ముగ్గురు మంత్రులు అవుట్?

ఏపీ కేబినెట్ సమావేశం తరువాత సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులలో దడ మొదలైంది. ఎలక్షన్లకు ఏడాది ముందు తమ పదవులు ఊడితే జనాలకు ముఖం ఎలా చూపించాలా అని ఆందోళన చెందుతున్నారు.

బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం జగన్ తన మంత్రులలో కొందరిని గట్టిగా హెచ్చరించారు. పనితీరు బాగులేదంటూ ఆయన ఆగ్రహించారు. నాలుగేళ్లలో మనం ఏ చేశామో చెప్పడమే కాదు ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టాలని.. ఆ పనిచేయలేని మంత్రులకు తన కేబినెట్లో స్థానం ఉండదని జగన్ అన్నట్లు చెప్తున్నారు. శాఖాపరమైన పనితీరు, పార్టీకి ఉపయోగపడుతున్న తీరు రెండూ బేరీజు వేసుకుని మంత్రివర్గంలో ఉంచాలో వద్దో నిర్ణయిస్తామని జగన్ అన్నారట.

దీంతో జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు ఎసరు తప్పదని వైసీపీలో వినిపిస్తోంది. ప్రధానంగా రెండు పేర్లు వైసీపీ వర్గాలలో వినిపిస్తున్నాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌లకు ఉద్వాసన తప్పదని వైసీసీ నేతలు చెప్తున్నారు.

అయితే… వీరి స్థానంలో ఎవరు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులను, వేణుగోపాల్ స్థానంలో కవురు శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపోతే మర్రి రాజశేఖర్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగన్ అనుకుంటుండడంతో ఆయన్ను కూడా తీసుకుంటారని చెప్తున్నారు. మర్రి రాజశేఖర్‌కు కేబినెట్లో స్థానం కల్పించేందుకు గాను విడదల రజినిని తప్పిస్తారని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే ప్రాంతానికిచెందిన నేతలు కావడంతో రజినిని డ్రాప్ చేసి మర్రిని తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కులాల లెక్కల ప్రకారం కూడా రజిని కంటే మర్రి సరైన ఆప్షన్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.