పాద‌యాత్రగా అసెంబ్లీకి కోటంరెడ్డి!

వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే , నెల్లూరు రూర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు ఆయ‌న స‌భ‌కు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. రెండో రోజు మాత్రం వ‌చ్చీరావ‌డంతో కాక పుట్టించారు. నెల్లూరు రూర‌ల్ నుంచి నేరుగా గుంటూరుకు వ‌చ్చిన ఆయ‌న రాత్రి అక్క‌డే బ‌స చేశారు. త‌ర్వాత‌.. కారులో సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్దకు చేరుకున్నారు.

ఇక‌, అక్క‌డ నుంచి ఆయ‌న పాద‌యాత్ర‌గా బ‌య‌లు దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. పాద‌యాత్ర‌లో కోటంరెడ్డి తన నియోజకవర్గంలో‌ని సమస్యలతో కూడిన‌ ప్ల కార్డులను ప్రదర్శించారు. పార్టీ అధికారంలో ఉంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నామ‌ని..క‌నీసం మురుగు గుంట‌లో చెత్త‌ను కూడా తీయించే అధికారం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుపై కోటంరెడ్డి స్పందించారు. తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు.(టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు వారి అంత‌రాత్మ ప్ర‌బోధాను సారం వోటు వేయాల‌న్నారు) వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు.

సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానని కోటంరెడ్డి చెప్పారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఇప్పుడు నిర‌స‌న గళం వినిపిస్తు న్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డులతో లేచి నిలబడ‌తాన‌న్నారు.

ఇదిలావుంటే… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు. మ‌రి లోప‌ల ఏం జ‌రుగుతుందో చూడాలి.