జూలైలో షిఫ్ట్‌.. విశాఖ నుంచే ఏపీ పాల‌న‌.. తేల్చేసిన జ‌గ‌న్‌

ఎవ‌రు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్న‌దే సాధించాల‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్ల‌న్న‌ట్టుగా ఉన్నారు. విశాఖ‌కు త‌ర‌లిపోయే విష‌యం.. రాజ‌ధానిగా మార్చే విష‌యం.. ఒక‌వైపు న్యాయ‌స్థానంలో ఉండ‌గానే ఆయ‌న మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌రకు కేవ‌లం కామెంట్ల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు

తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో సీఎం జ‌గ‌న్ విశాఖపై మ‌రో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మ‌న‌సులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. త‌ర్వాత పెట్టుబ‌డుల స‌ద‌స్సు సంద‌ర్భంగా విశాఖ‌లోనూ సీఎం జగన్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్‌ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ ద‌క్కించుకున్న‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం.