జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాపు నాయకుడు, వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అదే అక్కసు వెళ్లగక్కారు. తన సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో ఈ రోజు సాయంత్రం పవన్ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు ముందే అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో తనపై దాడి చేసేముందే.. తాను దాడి చేస్తే.. బెటర్ అనుకున్నారో..ఏమో పవన్‌పై విరుచుకుపడ్డారు.
బందర్‌లో జరిగే జనసేన సభ తస్మదియ దూషణ సభ మాత్రమే అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయ దృక్పథాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు తెలియజేశాడన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం పవన్ రాజకీయం చేస్తానని చెబుతున్నారని పాడిన పాటే మంత్రి వర్యులు పాడేశారు. ఇప్పటం సభ, మచిలీపట్నం సభకు ఏమీ తేడాలేదని సటైర్లు వేశారు. జగన్‌ను బలపరిచే కాపు నాయకులని తిట్టడం చంద్రబాబును బలపరచడం కోసమే ఈ సభ అని పేర్ని నాని అక్కసు వెళ్లగక్కారు.
కాపు కులాన్ని, కులస్తులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నాడంటూ.. గతంలో చేసిన విమర్శలనే మరో రూపంలో వండివార్చారు. పవన్ రాజకీయ సినిమా.. ఫ్లాప్ అయినా.. హిట్ అయిన పెద్దగా నష్టం లేదని చెప్పారు. అయితే.. వైసీపీ నాయకుడిగా తానెందుకు ముందుగానే స్పందిస్తున్నారో మాత్రం పేర్నిసార్ చెప్పకపోవడం గమనార్హం.
“ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టమ”ని పేర్ని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే వారిని తిట్టడం ముఖ్యంగా వైసీపీలోని కాపు నేతలను తిట్టడం పవన్ పనేనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి అధికారం కోసం ప్రయత్నం చేస్తారని.. కానీ పవన్ అలా కాదని .. ఇక ఎప్పటికీ ఇలానే ఉండిపోతాడని శాపాలు పెట్టారు.