ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల మాట మాట్లాడినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగుతోంది. ఎవరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా వైసీపీలో ఎవరోకరు రోజూ మూడు రాజధానుల ప్రస్తావన చేస్తునే ఉంటారు. త్వరలోనే పాలన విశాఖకు మారుతుందని జగన్ కూడా తరచూ చెబుతుంటారు. అసలు మూడు రాజధానులే లేవని, విశాఖ మాత్రమే ఏకైక రాజధాని అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో కూడా తాను త్వరలో విశాఖకు మారుతున్నట్లు, పారిశ్రామికవేత్తలంతా అక్కడే పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
నిజానికి మూడు రాజధానుల అంశాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. భూములిచ్చిన రైతులకు అనుకూలంగా తీర్చు చెప్పింది. సుదీర్ఘ ఆలోచన తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. హైకోర్టు తీర్పును కొట్టివేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే రాజధాని విశాఖకు మార్చబోతున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటనలిస్తూ వచ్చింది. దానితో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ సంగతి ప్రత్యేక ప్రస్తావనకు నోచుకుంటుందని అందరూ ఎదురుచూశారు. రాజధాని అంశం గవర్నర్ స్పీచ్ లో ఎక్కడ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఏర్పడింది.
అందరి అంచనాలు తలకిందులయ్యాయి. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ఎక్కడ చేర్చలేదు. ఇప్పటి వరకు వైసీపీ నేతల ప్రతీ ప్రసంగంలోనూ ఆ అంశం ఉండగా, ఈ సారి గవర్నర్ ప్రసంగంలో మాత్రం చేర్చలేదు. జగన్ ప్రభుత్వం వ్యూహాత్మక వెనుకడుగు వేసిందనుకోవాల్సి వస్తోంది.
గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి కారణం సుప్రీం కోర్టు విచారణేనని చెబుతున్నారు. నాలుగు మాటలు చేర్చితే అది కోర్టు ధిక్కారమవుతుందని భావించినట్లున్నారు. గవర్నర్ చేత ఎలాంటి ప్రకటన చేయించినా అది ప్రభుత్వానికి ఇబ్బందేనని టీడీపీ సైతం హెచ్చరించింది. పైగా గవర్నర్ కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసినందున ఆయన అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుందని, వచ్చిన కొత్తల్లోనే గవర్నర్ తో సంఘర్షణ వద్దని ప్రభుత్వం భావించినట్లు చెబుతున్నారు. ఎలాగూ రోజువారీ ప్రకటనలిస్తున్నప్పుడు మళ్లీ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని చేర్చకపోతే వచ్చే నష్టమేమిటని వైసీపీ విశ్లేషించుకుని ఆ అంశంలో మౌనం వహించిందని అంటున్నారు.