ఏమిటా ఉరవకొండ సెంటిమెంట్ !

ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయాల్లో మామూలు విషయమే. నువ్వు ఐరన్ లెగ్.. అంటే నువ్వు ఐరెన్ లెగ్ అని తిట్టుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఎవరికి వాళ్లు తాము గోల్డెన్ హ్యాండ్ అని.. పక్కనోడు ఐరెన్ లెగ్ అని చెప్పుకుంటుంటారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అసెంబ్లీ లాబీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు. బాగున్నారా అంటే బాగున్నారా అని పలుకరించుకున్నారు. చూసిన వాళ్లంతా అబ్బా ఎంత మంచి స్నేహితులు అని ముక్కున వేలేసుకున్నారు. కాకపోతే అక్కడే ఒక ట్విస్ట్ జరిగింది..

2024 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ మళ్లీ గెలవాలని పేర్ని నాని ఆకాంక్షించారు. ఇంకేముంది అబ్బ ఎంత పెద్ద మనసు అని కూడా అందరూ మెచ్చుకున్నారు. అంతలోనే నాని అసలు సంగతి చెప్పారు. పయ్యావుల కేశవ్ ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతుందని సెంటిమెంటు రగిల్చారు. అంటే పయ్యావుల గెలవాలి, చంద్రబాబు ఓడిపోవాలని ఆయన పరోక్షంగా అనేశారు. ప్రస్తుతం పయ్యావుల ఉరవకొండకు ప్రాతినిధ్యం వహిస్తుంటే..ఆయన పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షంలో కూర్చుంది..

కాస్త ఖంగు తిన్న పయ్యావుల తర్వాత కౌంటరిచ్చారు. ఈ సారి అలాంటి సెంటిమెంట్ పనిచేయదన్నారు. 1994లో ఉరవకొండలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ గెలిచిందని, 2024లో అదే జరగబోతోందని పయ్యావుల అన్నారు. వైసీపీ నేతలు ఎలాంటి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారనుకోండి. అదీ ఉరవకొండ సెంటిమెంట్…