IPS ఆఫీసర్ ప్రేమలో మంత్రిగారు !

గతానికి భిన్నమైన పరిస్థితులు కొన్ని వర్తమానంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం.. పాలనా వ్యవస్థలు రెండు రెండు దారులుగా ఉండటం తెలిసిందే. ఈ రెండు రంగాలకు చెందిన వారు పెళ్లాడటం అన్నది చాలా చాలా అరుదుగా చోటు చేసుకునే పరిస్థితి. దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో ఇలాంటి కాంబనేషన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు.

పంజాబ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు హర్ జోత్ బెయిన్స్. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ పుర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ నేతగా విజయం సాధించారు. అనంతరం భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఆయనకు విద్యా శాఖా మంత్రిగా అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా.. ఆయన ఐపీఎస్ అధికారిణి ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు.

2019 బ్యాచ్ కు చెందిన జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరికి మధ్య ప్రేమ చిగురించటం.. చివరకు ఇద్దరు పెళ్లాడాలని డిసైడ్ కావటం జరిగిపోయాయి. ఈ మధ్యనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లుగా చెబుతున్నారు. వీరి పెళ్లి ఈ నెలలో జరుగుతుందని.. దీనికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు.. పార్టీ నేతలు.. ఇతర పార్టీలకు చెందిన వారు హాజరవుతారని చెబుతున్నారు. ఇక.. అమ్మాయి తరపున ఐపీఎస్ లు.. ఐఏఎస్ లు.. ఇలా పలువురు అధికారులు కూడా హాజరు కానుండటంతో.. ఈ పెళ్లి వేడుక కొత్త వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు.