పవన్ మాటతో డిష్యుం డిష్యుం

జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు నేతల సమావేశం సందర్భంగా ఏపీలో కాపులందరూ ఏకతాటిపైకి రావాలని.. జనసేనకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునివ్వడం.. మునుపెన్నడూ లేని విధంగా కాపులకు చేరువ అయ్యేలా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకే తావిచ్చాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు విషయమై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇప్పటికే కొన్ని వారాల కిందట ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ వ్యాసం కారణంగా తెలుగుదేశం, జనసేన మధ్య సోషల్ మీడియాలో పెద్ద అగాథానికి దారి తీశాయి. ఆ వ్యాసంలో పవన్‌కు వెయ్యి కోట్లిచ్చి తెలుగుదేశం పార్టీకి దూరం చేసేలా కేసీఆర్ వ్యూహం పన్నుతున్నారని రాధాకృష్ణ రాయగా.. పవన్ మీద ప్యాకేజీ ముద్ర వేయడానికి, టీడీపీని వీడి వెళ్లకుండా చేయడానికి చంద్రబాబే రాధాకృష్ణతో ఇలా రాయించాడంటూ జనసైనికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వాళ్లకు బదులిస్తూ టీడీపీ వాళ్లు ఎదురు దాడి చేశారు. దీని వల్ల రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ వేడి కాస్త చల్లారుతోంది అనుకుంటుండగా.. పవన్ వ్యాఖ్యలతో మళ్లీ మంట మొదలైంది.

తెలుగుదేశం మంచిగా ఉంటూనే తమను 20 సీట్లకు పరిమితం చేయాలని చూస్తోందని.. లోపాయకారీ ఒప్పందాలకు తాను లొంగనని పవన్ వ్యాఖ్యానించాడు. ఐతే ఈ వ్యాఖ్యల మీద ట్విట్టర్లో టీడీపీ వాళ్లు గట్టిగా స్పందించారు. పవన్ టీడీపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని.. జనసేన బలం మేరకే సీట్ల కేటాయింపు జరుగుతుందని.. ఆ పార్టీకి 20 సీట్లు ఇచ్చినా ఎక్కువే అని వాళ్లు కౌంటర్ చేయగా.. జనసేన వాళ్లు కూడా దీటుగా స్పందిస్తున్నారు.

తమ పార్టీతో పొత్తు లేకుంటే టీడీపీది అధోగతే అని.. 2014లో ఆ పార్టీ గెలిచిందన్నా.. 2024లో గెలవాలన్నా తమ పార్టీ మీద ఆధారపడాల్సిందే అని.. పైగా ఇప్పుడు జనసేన బలం పెరిగిందని.. అలాంటపుడు ఎన్ని డిమాండ్ చేస్తే అన్ని సీట్లు ఇచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని వాళ్లంటున్నారు. ఇలా టీడీపీ, జనసేన వాళ్లు గొడవపడుతుంటే.. వైసీపీ వాళ్లు మాత్రం వినోదం చూస్తున్నారు. తాము కోరుకున్నది ఇదే అని, ఈ గొడవ ఇలాగే కొనసాగి ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా వేర్వేరుగా పోటీ చేసి జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని వాళ్లు లోలోన అనుకుంటున్నారు.