యూత్ ఫార్ములానే కాంగ్రెస్ నమ్ముకున్నదా ?

Revanth Reddy

రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ యూత్ ఫార్ములాను నమ్ముకున్నట్లుంది. 25 శాతం టికెట్లను యూత్ కే కేటాయించాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ప్రపోజల్ పంపారట. దానికి ఖర్గే కూడా ఓకే చెప్పారని పార్టీవర్గాల సమాచారం. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న నేతల్లో చాలామంది గుదిబండలుగా మారారనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నదే. పార్టీలోకి కొత్త నీటిని ఆహ్వానించాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి.

ఎంతసేపూ సీనియర్లకే పదవులు, టికెట్లలో పెద్దపీట వేస్తే ఇక జూనియర్లు, యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రేవంత్ సరికొత్త ఫార్ములాను రెడీచేశారట. దీని ప్రకారం 119 నియోజకవర్గాల్లో కనీసం 25-30 నియోజకవర్గాల్లో యూత్ కే టికెట్లు కేటాయించాలని పట్టుబట్టారట. ఇక్కడ యూత్ అంటే 40 ఏళ్ళలోపు వారని అర్ధం.

ఇప్పటికే రెండుసార్లు తెలంగాణాలో పాదయాత్రలు చేసిన రేవంత్ ఈ సందర్భంగా అనేకమంది యూత్ లీడర్లతో భేటీలు జరిపారట. అలాగే కొందరు సీనియర్లతో కూడా మంతనాలు జరిపారట. ఆ తర్వాతే యూత్ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముషీరాబాద్ కు అనీల్ కుమార్ యాదవ్, గోషామహల్లో మెట్టు సాయికుమార్, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, ఖైతరాబాద్ లో విజయారెడ్డికి టికెట్లు ఖాయమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో పోటీచేసే వారిని ముందే ఫైనల్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారట. చివరి నిముషంవరకు టికెట్ ఫైనల్ చేయకపోతే ప్రచారం, గెలుపు అవకాశాలు కష్టమవుతాయనేది భావన.

అంతా బాగానే ఉందికానీ యూత్ కు 25 శాతం టికెట్లంటే మరి సీనియర్లు ఏమి చేస్తారు ? చూస్తూ ఊరుకోరు కదా. తమకున్న పలుకుబడితో టికెట్లు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. అసలే కాంగ్రెస్ అంటే అపరిమితమైన స్వేచ్చకు పేరున్న పార్టీ. కాబట్టి రేవంత్ ప్రపోజల్ ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. దేశవ్యాప్తంగా యూత్ కు మంచి ప్రోత్సాహం ఇవ్వాలని అధిష్టానం గట్టిగా డిసైడ్ అయితే రేవంత్ సిఫారసు వర్కవుటవుతుంది లేకపోతే కష్టమే.