సైకో పోవాలి సైకిల్ రావాలి…. ఈ నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్నదే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని గెలిపించాలన్న ఉద్దేశంతో జనంలోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లారు. ప్రాస పరంగా క్యాచీగా ఉండటంతో సైకో పోవాలి నినాదం సగటు ఓటర్లకు బాగానే ఎక్కింది.
టీడీపీ ఎవరితో కలిసి పోటీ చేస్తుందో, పొత్తు భాగస్వాములు ఎవరో ఇంకా తెలియలేదు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఖాయమనిపిస్తున్నప్పటికీ ఆ దిశగా చర్చలు జరగలేదు. ప్రకటనలు రాలేదు. చంద్రబాబు, పవన్ రెండు సార్లు భేటీ అయిన తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు.
జనసేన పదవ వార్షికోత్సవం సందర్భంగా కొత్త నినాదం తెరపైకి వచ్చింది. జగన్ పోవాలి…పవన్ రావాలి.. అన్న నినాదాన్ని కాపు సంక్షేమ సేన గౌరవాధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ ముఖ్యమంత్రి కావాలని, అందుకు కాపులంతా ఐకమత్యంగా ఉండాలని హరిరామ జోగయ్య చాలా రోజులుగా నినదిస్తున్నారు. జోగయ్య మొదటి నుంచి పవన్ పక్షం వహిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం, జనసేనతో కలిసి పనిచేస్తుందని హామీ ఇస్తున్నారు. పవన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమని చెబుతున్నారు.
జగన్ పోవాలి…పవన్ రావాలి… అంటూ జనసేన ఆవిర్భావ సభలో జోగయ్య చేసిన నినాదం ఇప్పుడు పొత్తుల చర్చల్లో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. చంద్రబాబు నుంచి దూరం జరగాలని పవన్ కు జోగయ్య సూచిస్తున్నారా.. అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఏదో ఉత్తేజ పరిచేందుకు జోగయ్య అలా అన్నారా.. లేక నిజంగానే జనసేన ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా చూడాలి..