ఒక మనిషి ఒకసారి తప్పు చేస్తారు.. సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మరి నాయకులు.. చేయరాని తప్పులకు కడు దూరంగా ఉండాలి. ఒకవేళ చపలచిత్తంతో చేసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం అయినా చేయాలి. కానీ, బీఆర్ ఎస్ నాయకుడు, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
మహిళల విషయంలో నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ, రాజయ్య మాత్రం అదే పనిగా.. మహిళల విషయంలో విమర్శలకు గురవుతున్నారు. గతంలో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా.. కేసీఆర్ ఆయనను డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుంచి రాత్రికిరాత్రి దించేసి.. బుద్ధి చెప్పారనే వాదన పార్టీలో వినిపించింది.
అయినా.. కూడా రాజయ్య మరోసారి అడ్డంగా దొరికిపోయారని బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లు గా నలుగుతున్న ఈ వ్యవహారం తాజాగా మరింత రచ్చగా మారింది. రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నా రని నవ్య ఆరోపణలు చేశారు.
రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మొత్తంగా ఎన్నికలకు ముందు.. రాజయ్య మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates