నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యువగళానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించడంతో పాటు టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత వాటిని ఎలా సరిదిద్దుతామో లోకేష్ వివరిస్తున్నారు. తమ హామిలు జనానికి గుర్తుండిపోయేలా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోనే పాదయాత్ర 520 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 40 రోజులకు పైగా ప్రయాణంలో 13 నియోజకవర్గాలు తిరిగింది. ప్రతీ చోట ప్రజాస్పందన పెల్లుబికింది. లోకేష్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు.
వైసీపీ ప్రభుత్వం మాత్రం పాదయాత్రపై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పోలీసు, రెవెన్యూ సహా అన్ని శాఖలను యాత్రపైకి ఉసిగొల్పుతోంది.
40 రోజుల పాదయాత్రలో మొత్తం 22 కేసులు నమోదు చేశారు. అంటే సగటున రెండు రోజులకు ఒక కేసు పెట్టినట్లయ్యింది. 11 కేసులు పోలీసు శాఖే పెట్టింది. వీఆర్ఓల చేత మూడు కేసులు పెట్టించారు. తహసీల్దారు ఒక కేసు పెట్టారు. మరో కేసులో మున్సిపల్ కమీషనర్ , రెండు కేసుల్లో ఎంపీడీఓ , ఒక కేసులో గజిటెడ్ అఫీసర్ ఫిర్యాదు దారులుగా ఉన్నారు. విశేషమేమిటంటే అన్ని కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా లోకేషే ఉన్నారు. లోకేష్ ను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చిల్లర కేసులు పెడుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి..
ఎన్నికేసులు పెట్టినా ప్రజల కోసం వాటిని భరిస్తానని లోకేష్ చెప్పుకుంటున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న ఆలోచనతోనే తాను యాత్రను ప్రారంభించానని, వైసీపీ కబంద హస్తాల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించడమే తన కర్తవ్యమని లోకేష్ అంటున్నారు. కేసులకు భయపడేవాళ్లమైతే ఎప్పుడో రాజకీయాల నుంచి తప్పుకునే వాళ్లమని లోకేష్ అంటున్నారు.