మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!


మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేయించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే కోర్టును కూడా కోరారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేదు. షెడ్యూల్ ప్ర‌కార‌మే కేసును విచా రిస్తామ‌ని.. దీనికి జూన్ జూలై వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది. దీంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పాల‌నా రాజ‌ధానిని క‌నుక విశాఖ‌కు త‌ర‌లిస్తే.. మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

త‌ద్వారా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు బిగించిన‌ట్టు అవుతుంద‌నికూడా.. వైసీపీ భావించింది. అయితే.. వైసీపీకి ఉన్న తొంద‌ర‌కు.. న్యాయ‌వ్య‌వ‌స్థ బ్రేకులు వేస్తూ వ‌చ్చింది. దీంతో ఈ ఉగాదికి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో జూన్ జూలై నాటికి వైసీపీకి అనుకూలంగా ఏదైనా తీర్పు వ‌చ్చినా.. రాజ‌ధానిరైతులు.. మ‌రోసారి రివ్యూ పిటిష‌న్ వేస్తే.. ఆగిపోయే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. రాజ‌ధాని అంశం అలానే ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అజెండాను వైసీపీ చేర్చే అవ‌కాశం ఉంది. మ‌రి దీనికి ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా? అనేది చూడాలి. ఏదైనా తేడా వ‌స్తే.. అమ‌రావ‌తి కే ప్ర‌జ‌లు జై కొడితే.. అప్పుడు వైసీపీ వ్యూహం మొత్తానికి విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.