ఇచ్చిన వాంగ్మూలం వెన‌క్కి తీసుకుంటా: క‌విత కేసులో భారీ ట్విస్ట్‌

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత మ‌రో 24 గంట‌ల్లో ఈడీ ముందు హాజ‌రై విచాణ‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ క్ర‌మంలోఅస‌లు ఏం జ‌రు గుతుంది..? ఆమె అరెస్టు అవుతారా? ఈడీ ఆమెను నిర్బంధిస్తుందా? అనే సందేహాలు.. స‌మ‌స్య‌లు.. రాజ‌కీ యంగా దుమారాలు చెలరేగాయి. అయితే.. ఇంత‌లోనే ఆక‌స్మికంగా.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది.

క‌వితను విచారించేందుకు కీల‌క‌మైన‌.. ఈడీ ఆది నుంచి చెబుతున్న రామ‌చంద్ర‌పిళ్ల‌యి(క‌విత‌కు బినామీ ఈయ‌నేన‌ని ఈడీ కోర్టుకు తెలిపింది) వాంగ్మూలం విష‌యంలో సూప‌ర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకునేందుకు అవ‌కాశం ఇవ్వాలంటూ.. పిళ్ల‌యి.. కోర్టుకు వెళ్లారు. తాజాగా ఆయ‌న రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

ఈ పిటిష‌న్‌పై సానుకూలంగా కోర్టు నిర్ణ‌యం తీసుకుంటే.. పిళ్ల‌యి చెప్పిందంతా కూడా ‘తూచ్‌’ అవుతుంది. దీంతో మ‌రోసారి ఈడీ విచార‌ణ మొద‌టి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పిళ్ల‌యి ఇచ్చిన‌స‌మాచారం ఆధారంగానే ఢిల్లీ కేసును ఈడీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తానిచ్చిన స‌మాచారాన్ని(వాంగ్మూలాన్ని) వెన‌క్కి తీసుకుంటాన‌ని పిళ్ల‌యి చెప్ప‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీకి చెప్పిన విష‌యాల్లో.. తను కవిత బినామీనని పిళ్ల‌యి చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయి. వేరు వేరు అకౌంట్ల ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్‌నకు 32.5 శాతం వాటాలున్నాయని, వీటిలో సైతం కవితకు వాటాలందాయని ఈడీ చెబుతోంది.