నేను పది సూపర్ హిట్లు కొట్టగలను-ఎంపీ


రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాడని చాలామందికి తెలియదు. అతను ‘ఓయ్ నిన్నే’ అనే ఊరూ పేరూ లేని సినిమా ఒకటి చేశాడు. అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ వేవ్ నడిచిన 2019 ఎన్నికల్లో రాజమండ్రిగా గెలిచేశాడు భరత్. ఎంపీ అయ్యాక కూడా భరత్ తన కెమెరా మోజును ఏమీ తగ్గించుకోలేదు. పబ్లిసిటీ కోసం అతను పడే తపన గురించి సోషల్ మీడియాలో తరచుగా కౌంటర్లు పడుతుంటాయి.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా భరత్‌ను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. అతణ్ని ‘ఏక చిత్ర కథానాయకుడు’ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలు భరత్‌కు బాగానే కోపం తెప్పించినట్లున్నాయి. రఘురామకు కౌంటర్ ఇస్తూ.. తాను అనుకుంటే సూపర్ స్టార్ కాగలనని.. పది సూపర్ హిట్ సినిమాలు తీయగలనని స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

“సినిమాల్లో మాదిరే రాజకీయాల్లో కూడా కామెడీ ఉండాలి. మరీ సీరియస్‌గా ఉండకూడదు. ఆయన్ని రాజకీయాల్లో కమెడియన్‌గా పరిగణించవచ్చు. రఘురామకృష్ణంరాజు నా గురించి ఏదో వాగుతా ఉన్నాడు. ఏకచిత్ర నటుడు అని ఏదో నోటికొచ్చినట్లు వాగుతా ఉండాడు. నేను కావాలనుకుంటే, తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. అదేం గగనం కాదు. ఏక చిత్రం కాదు పది చిత్రాలు తీయగలను. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్‌కి. అందులో నీకు కూడా ఒక కమెడియన్ పాత్ర ఇస్తాను. నువ్వు గోచీ కడతావు కదా. నీకంటే నటుడు ఎవరు లేరు. అరిటాకు స్టోరీ ఇంకా ఎవరూ మరిచిపోలేదు. పార్లమెంటులో తెలుగు రాని వాళ్లు కూడా ఇతని యాక్టింగ్ చూస్తుంటారు.. అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్. నువ్వు కామెడీ స్టార్‌కు ఎక్కువ. ఎందుకు పనికిమాలిన స్టార్‌కి తక్కువ. నువ్వేంటో తెలుసుకో ముందు. నేను ఒక సినిమా కాదు పది సినిమాలు చేయగలను. పది సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతా. హీరోగా చేయగలను. నువ్వు కమెడియన్‌గా కూడా పనికి రావు. నేను పది సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ స్టార్‌ కింద చేయగలను. నాకున్న టాలెంట్‌కి. అన్ని రంగాల్లో టాలెంట్ ఉన్నవాడిని” అని భరత్ అన్నాడు.