ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ కోటాల్లో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. వీటిలో ఎమ్మెల్యే కోటాను పక్కన పెడితే.. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ కోటాలో ఎన్నికలు మాత్రం చాలా హాట్ హాట్‌గా సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే 2024 ఎన్నికలకు.. సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మద్దతు దారులు గెలిచేలా నేరుగా ఆయా పార్టీలే రంగంలోకి దిగాయి. అయితే.. ఇప్పుడు వైసీపీ ఒక విధంగా దూకుడు పెంచితే.. వైసీపీని నిలువరించేందుకు టీడీపీ మరో వ్యూహంతో ముందుకు సాగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో ఎన్నికలు సార్వత్రికాన్ని తలపిస్తున్నాయి.
ఒక్కొక్క ఓటుకు రూ.10 వేల చొప్పున వైసీపీ మద్దతుతో రంగంలో ఉన్న అభ్యర్థులు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో వారికి సంబంధించి పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తున్నారని అంటున్నారు. ఉదాహరణకు రాయలసీమలో ఉపాధ్యాయులు కొందరు.. తాజాగా బదిలీలు తెచ్చుకున్నారు. వీరికి నోటి మాటగానే కాదు.. లిఖిత పూర్వకంగా కూడా హామీ దక్కిందని తెలుస్తోంది.
ఇది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఇచ్చిన తాయిలమని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దొంగ ఓట్లను సృష్టించారనే ప్రచారం జోరుగా ఉంది. ఎన్నికలకు సమయం మించి పోవడం.. ఎన్నికల కమిషన్‌కు పక్కా ఆధారాలు అందించడంలో జరుగుతున్న జాప్యంతో ఈ ఓట్లు యథాతథంగా పడడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. సార్వత్రిక సమరాన్ని తలపిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీదే మరోసారి విజయం అంటున్నారు పరిశీలకులు.