అమరావతి భూములు అమ్మేస్తోందా ?

రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. 75 కోట్ల వస్తుందని ఆశిస్తోంది.

కాజ-గుండుగొలను బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఉన్న నవులూరు గ్రామంలో 10 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ ఎకరా రు. 5.94 కోట్లున్నట్లు ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసింది. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు దగ్గరలో ఉన్న పిచ్చుకలపాలెం గ్రామంలో మరో 4 ఎకరాలను అమ్మకానికి సిద్ధం అయ్యింది. ఇక్కడ ఎకరా ధర రు. 5.4 కోట్లుగా లెక్కకట్టింది. బేసిక్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అంతకుమించిన ధరే వస్తుందని అంచనా వేస్తోంది. మరీ డబ్బును ప్రభుత్వం దేనికి వాడుతుందో తెలీటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జగన్ ఏమో రాజధానిని విశాఖలో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. టీడీపీ, రైతులేమో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావటంతో సుప్రింకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది.

కోర్టులో విచారణ జరుగుతోందంటేనే సదరు అంశం వివాదాస్పదమని అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి అంశం వివాదాస్పదమంటే భూములు కూడా కలిపే అనర్ధం. మరి విదాదంలో ఉన్న భూములను ప్రభుత్వం అమ్మకానికి ఎలా పెడుతోంది ? కోర్టులో ఈ వివాదం తేలేంత వరకు ప్రభుత్వం భూముల విషయంలో వేలు పెట్టేందుకు లేదు. గతంలో కూడా ఒకసారి ఈ వేలం ద్వారా అమ్మకానికి భూములను రెడీ చేసి మళ్ళీ ఎందుకనో వెనక్కు తగ్గింది. మళ్ళీ రెండోసారి భూములను అమ్మకానికి రెడీ చేస్తున్న ప్రభుత్వం ఈసారి ఏమి చేస్తుందో చూడాలి.