ప్రతీ అడుగు, ప్రతీ మాట వ్యూహాత్మకమే…

ఆయన పార్టీ అధినేత కొడుకు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు. ఇంతకాలం తండ్రి చాటు బిడ్డడిగానే కనిపించారు. తండ్రి పై కోపంతో ప్రత్యర్థులు ఆయనకు పెట్టిన పేరు పప్పు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరేం చేసినా సహనమే సొంత ఆయుధంగా ఆయన ముందుకు సాగారు. ఇప్పుడు యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల దాటిన నేపథ్యంలో నారా లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారు.

పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి లోకేష్ తన బృందం ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో తన సొంత నిర్ణయాలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రతీ తప్పిదాన్ని ఏకరవు పెట్టేందుకు అవసరమైన హోంవర్క్ చేశారు.జగన్ పాలనలో అన్ని వర్గాల వారు అణచివేతకు గురైనట్లు చెప్పే దుష్టాంతాలను ఆయన తరచూ ప్రస్తావిస్తున్నారు. కనీసం రెండు రోజులకు ఒకసారైనా మైనార్టీ వర్గాలతో లోకేష్ భేటీ అవుతున్నారు. మైనార్టీ సంక్షేమం కోసం అప్పట్లో టీడీపీ చేపట్టిన పనులు, ఇప్పుడు వేసీపీ వాటిని విస్మరించిన తీరును ఆయన ప్రతీరోజూ వివరిస్తున్నారు.

లోకేష్ మరో టార్గెట్ కుల సంఘాలనే చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని కులాలను లోకేష్ కవర్ చేశారు. ప్రతీ కులం వారిని పిలిపించి ముఖాముఖి నిర్వహిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. వారి కోసం టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు నేతల దృష్టికి తెస్తున్నారు.

వేర్వేరు వృత్తుల వారిని కూడా లోకేష్ తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. రాష్ట్రంలో ఏడు వేల మంది ఫిజియో థెరపిస్టులు ఉంటే కేవలం ఏడుగురికి మాత్రమే ప్రభుత్వోద్యోగం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయిన లోకేష్, టీడీపీ అధికారంలోకి రాగానే దిద్దుబాటు చర్యలు చేపడతామని వెల్లడించారు.

లోకేష్ స్పెషల్ టార్గెట్ యువకులేనని చెప్పాలి. ప్రతి రోజు నిర్వహించే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. రోజు వెయ్యి మందితో సెల్ఫీ విత్ లోకేష్ నిర్వహిస్తే అందులో 70 శాతం వరకు యూతే ఉంటోంది.

ఇక మహిళా దినోత్సవం రోజున లోకేష్ మహిళా ఓటర్లను ఆకట్టుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. భూమి కంటే ఎక్కువ భారం మహిళలే మోస్తున్నారని లోకేష్ అంటుంటే చెమ్మర్చిన కన్నులతో చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని, చిన్న వయస్సు నుండే మగవాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అధికారానికి రాగానే ముందు ఆ పనిచేస్తామన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని, మహిళా మంత్రులే ఆడవారిపై జులుంను ప్రదర్శిస్తున్నారన్నారు. దళిత మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నామన్నారు. మహిళలందరికీ లోకేష్ పాదాభివందనం చేసి, వారి గొప్పదనాన్ని కీర్తించడం అందరినీ ఆకట్టుకుంది.

ఏదేమైనా లోకేష్ ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాల మద్దతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలిచే వీలుందని గ్రహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రతీ అడుగు ఆ దిశగానే వేస్తున్నారు…