వినటానికే విచిత్రంగా ఉంది ఈ విషయం. 2018లో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో కత్తే కీలకమైన సాక్ష్యం. అలాంటిది విచారణలో అసలు కత్తే కనిపించలేదని కోర్టు గుర్తించటం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ విషయం ఏమింటే జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మంగళవారం జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ మొదలైనపుడు దాడికి సంబందించి నిందితుడు శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువులన్నింటినీ కోర్టులో ప్రజెంట్ చేయాలి.
అప్పట్లో నిందితుడి దగ్గర నుండి ఎయిర్ పోర్టు సెక్యూరిటి అయిన సీఐఎస్ఎఫ్ అధికారులు కోడికత్తి, సెల్ ఫోన్, పెన్ను, పర్సుతో పాటు జగన్ వేసుకున్న చొక్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు మొదలైనపుడు వస్తువులన్నింటినీ దర్యాప్తు అధికారులకు అప్పగించారు. అప్పటి నుండి ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. అలాంటిది మంగళవారం విచారణ జరిగింది. నిందితుడితో పాటు సీఐఎస్ఎప్, ఎన్ఐఏ ఉన్నతాధికారులంతా కోర్టులో హాజరయ్యారు.
విచారణ మొదలైన తర్వాత నిందితుడు దాడికి వాడిని కోడికత్తితో పాటు అప్పట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను బయటపెట్టమని జడ్జి అడిగారు. సాక్ష్యాలుంచిన బ్యాగును అధికారులు ఓపెన్ చేసినపుడు జగన్ చొక్కా తప్ప మరింకే వస్తువులు కనబడలేదట. ముఖ్యంగా దాడిలో ఉపయోగించిన కత్తి మిస్సయినట్లు జడ్జి గుర్తించారు. కీలకమైన కత్తే మిస్సయితే ఇక విచారణ ఎలా ముందుకు వెళుతుందని జడ్జి మండిపోయారట.
మరిప్పుడేం చేయాలి ? అందుకనే కేసును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసిన జడ్జి అప్పటికి మిస్సయిన వస్తువులన్నింటినీ కోర్టు ముందుంచమని గట్టిగా చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంతో కీలకమైన సాక్ష్యాలు ఎలా మిస్సయయో అర్ధంకావటంలేదు. కోడికత్తి తదితరాలు ఎప్పుడు మిస్సయాయి ? కోర్టు విచారణకు వచ్చేటపుడు అన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని అధికారులు చూసుకోరా ? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు ? మిస్సయిన ఆధారాలను అధికారులు ఎలా సంపాదించగలరో చూడాలి.