నో ఫ్యామిలీ ప్యాకేజీ

వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. నియోజకవర్గాల్లో పట్టుందన్న కారణంగా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న చాలామంది సీనియర్లకు తన తాజా నిర్ణయంతో కేసీయార్ చెక్ పెట్టినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ ఫ్యామిలీ ప్యాకేజీ విషయంలో అగ్రకులాలకు చెందిన సీనియర్ నేతలు ఎక్కవ ఒత్తిడి పెడుతున్నారట. ఒక నేతకు రెండు టికెట్లిస్తే మిగిలిన నేతలు కూడా అదే పద్దతిలో ఒత్తిడి పెట్టడం ఖాయమని కేసీయార్ భావించారని సమాచారం.

అందుకనే అసలు ఏ కుటుంబానికి కూడా రెండు టికెట్లు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించారట. తొందరలో జరగబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా సర్వేల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఉండబోతోందని ఇప్పటికే హింగ్ ఇచ్చేశారట. పార్లమెటు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపే చాలామంది సీనియర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో తమ కుటుంబంలోని వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కేసీయార్ కు దరఖాస్తు చేసుకున్నారట. రాబోయే ఎన్నికలు వ్యక్తిగతంగా కేసీయార్ కు పార్టీపరంగా బీర్ఎస్ కు ఎంతో కీలకమైనది.

కాబట్టి టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్తగా చేయాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఇప్పటికే సర్వేల్లో బయటపడింది. సీరియర్లలో చాలామంది కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళకి రెండో టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇవ్వాలని అడిగారట. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యుటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి లాంటి చాలామంది సీనియర్లు రెండు టికెట్లు అడుగుతున్నట్లు ప్రచారంలో ఉంది.

రెండు టికెట్లు కాదు అసలు చాలామంది సీనియర్లకు కేసీయార్ టికెట్లు ఇస్తారా అనేదే డౌటుగా ఉందట. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా సర్వే రిపోర్టుల్లో మంచి ఫీడ్ బ్యాక్ వస్తేనే అనేది కీలక పాయింట్ గా పెట్టుకున్నారు కేసీయార్. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.