ఆత్మసాక్షిగా… పొత్తు పెట్టుకుంటేనే గెలుపు

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నాయి. మరో ఏడాది లోపే పోలింగ్ నిర్వహించి తదుపరి ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఉంది. విజయంపై ఎవరి ధీమా వారికి ఉంది. సీఎం జగన్ వై నాట్ 175 అంటే అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామని అంటున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదంతో టీడీపీ ఇప్పటికే ఒక రేంజ్ తో దూసుకుపోతోంది. ఇరు వర్గాలు యమ స్పీడులో ఉండటంతో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతానికి ఉంది.

గుట్టు విప్పిన ఆత్మసాక్షి…

ఎన్నికల సర్వేలు చేసే సంస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. ఎన్నికలు లేకపోయినా ఆ సంస్థలు సర్వే చేస్తూ పార్టీల బలాబలాలను, జననాడిని బయట పెడుతుంటాయి. అలా శ్రీ ఆత్మసాక్షి అనే సంస్థ ఒక సర్వే చేసింది. సర్వేల్లో విశ్వసనీయత ఉన్న సంస్థగా పేరు పొందిన ఆత్మసాక్షి.. కొన్ని ఆసక్తికర అంశాలను ఆవిష్కరించింది.

ఏపీలో టఫ్ ఫైట్

దాదాపు నాలుగు నెలల పాటు ఆత్మసాక్షి ప్రతినిధులు ఏపీలో తిరుగుతూ ప్రజల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. గతేడాది నవంబరు మొదటి వారం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారం వరకు జరిగిన ఈ సర్వే ఆధారంగా ఫలితాలను కూడా సామాజిక5 మాధ్యమాల్లో ఉంచింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 స్థానాలు, జనసేనకు 7 స్థానాలు వస్తాయని తేల్చింది..

ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో కూడా ఆత్మసాక్షి తేల్చింది. అధికార వైసీపీకి 41.50 శాతం ఓట్లు వస్తాయని ప్రకటించింది. విపక్ష టీడీపీకి 42.50 శాతం ఓట్లు, జనసేనకు 11 శాతం, ఇతరులకు 2.5 శాతం వస్తాయని ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేను బట్టి తెలుస్తోంది..

అర్థం చేసుకుంటారా..

పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఓట్లు, సీట్లపైనే ఆత్మసాక్షి సర్వే జరిపింది. అందుకే హంగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు పార్టీలు కలిస్తే 53.50 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పైగా తటస్థ ఓటర్లు కూడా వాళ్ల వైపు మొగ్గు చూపి ఆ కూటమికి వచ్చే ఓటింగ్ శాతం ఇంకొంచెం పెరగవచ్చు. అదే జరిగితే రెండు పార్టీలు కలిసి క్లీన్ స్వీప్ చేస్తాయి. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ సోదిలో కూడా లేకుండా పోతుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆ సంగతి గ్రహిస్తారో లేదో చూడాలి. మరి జగన్ ను ఓడించాలంటే పంతాలు, పట్టింపులకు పోకూడదు.