కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలు కాబట్టి ఆశావహుల నుండి కేసీయార్ పై సహజంగానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈనెల 29వ తేదీన ఎంఎల్ఏల కోటాలో ముగ్గురు ఎంఎల్సీల పదవీకాలం ముగుస్తోంది. మూడుస్ధానాల్లోను ఇపుడు అధికార బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి భర్తీ కాబోయే స్ధానాలు కూడా అధికారపార్టీకే దక్కబోతున్నాయి. నామినేషన్ వేస్తే గెలిచిపోతారు కాబట్టే ఈ మూడుస్ధానాలను దక్కించుకునేందుకు నేతల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది.

నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం నెలాఖరుకు ముగియబోతోంది. ఈ మూడుస్ధానాలను భర్తీ చేయాలంటే కేసీయార్ కుల సమీకరణలు, ఆర్ధిక పరిస్ధితి, అభ్యర్ధుల వ్యక్తిగత సామర్ధ్యం లాంటి ఎన్నో సమీకరణలను చూడాల్సుంటంది. ఒకవైపు కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం. మరోవైపు ఎంఎల్ఏలు, నేతల మధ్య పెరిగిపోతున్న వివాదాలు. ఇంకోవైపు అధికారం తమదే అని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.

ఇలా అన్నీవైపుల నుండి కేసీయార్ పై ఒత్తిళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇపుడు ఎంఎల్సీలుగా ఎంపిక చేయబోయే నేతలు, వాళ్ళ సామాజికవర్గాలు సహకరించాలని సహజంగానే ముఖ్యమంత్రి ఆశిస్తారు. మరంతటి స్ధాయి ఉన్న నేతలు ఎవరున్నారు ? ఉద్యమకాలం నుండి కష్టపడుతున్న తమకు కేసీయార్ ఇప్పటివరకు అవకాశాలు ఇవ్వలేదని చాలామంది మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎంఎల్సీ పదవుల్లో తమను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఎంఎల్సీ పదవులు ఇస్తానని కేసీయార్ దగ్గర హామీలు పొందిన సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్యగౌడ్, చల్లా వెంట్రామరెడ్డి పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అలాగే నవీన్ కుమార్ కు రెన్యువల్ ఉంటుందని కూడా ప్రచారంలో ఉంది. వీళ్ళు కాకుండా అరికల నర్సారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చకిలం అనీల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి లాంటి అనేకమంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగున్నా ఇపుడు ఎంఎల్సీలు అవబోయే వాళ్ళు హ్యాపీగా ఆరేళ్ళు పదవుల్లో ఉంటారు. మరి చివరకు ఆ లక్కీ నేతలెవరో చూడాల్సిందే.